బాబు ష్యూరిటీ.. సీటుకు లేదు గ్యారంటీ..! | - | Sakshi
Sakshi News home page

బాబు ష్యూరిటీ.. సీటుకు లేదు గ్యారంటీ..!

Published Wed, Mar 13 2024 2:10 AM | Last Updated on Wed, Mar 13 2024 2:26 PM

- - Sakshi

బీసీ నేత నూకసానికి ఎంపీ సీటు ఇస్తానని చంద్రబాబు హామీ

తాజాగా మాగుంట వైపు బాబు చూపు 

కనీసం పేరు కూడా పరిగణలోకి తీసుకోకపోవడంపై నూకసాని అసంతృప్తి

టీడీపీ– జనసేన ఆత్మీయ సమావేశానికీ ఆహ్వానించకుండా అవమానం 

టీడీపీలో బీసీల పట్ల కొనసాగుతున్న వివక్ష

బీసీల ఉనికిని సహించలేకపోతున్న దామచర్ల 

పేరుకే జిల్లా అధ్యక్షుడు..పెత్తనమంతా దామచర్లదే

తెలుగుదేశం పార్టీ ‘జయహో బీసీ’ అంటూ గుంటూరులో ఆర్భాటంగా సమావేశం నిర్వహించింది. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగటమే లక్ష్యం అంటూ డిక్లరేషన్‌ ప్రకటించింది. ఇది కేవలం ప్రకటనలకే పరిమితం. వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంటోంది. జిల్లాకు చెందిన ఒక బీసీ సామాజికవర్గానికి చెందిన నేతకు ఎంపీ సీటు ఇస్తానని సాక్షాత్తూ చంద్రబాబే హామీ ఇచ్చారు. ఇప్పుడు డబ్బున్న బడా వ్యక్తి కళ్లెదుట కనిపించేసరికి ఆ నేతను కరివేపాకులా తీసిపడేశారు. ఇదేనా బీసీ డిక్లరేషన్‌ అంటూ పార్టీ కేడర్‌ అంతర్గతంగా మథనపడుతోంది. గతంలో మాదిగానే బీసీ నినాదం కేవలం ఎన్నికలకే పరిమితం చేస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్‌ మాజీ అధ్యక్షుడు, టీడీపీ పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీని టీడీపీ అధిష్టానం మొండిచేయి చూపింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆయన పట్ల చిన్నచూపు ప్రదర్శిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన భావించారు. కనిగిరి, గిద్దలూరు శాసనసభా స్థానాల్లో ఏదైనా ఒక సీటు కేటాయించాలని పార్టీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే అసెంబ్లీ సీటు ఇవ్వడం కుదరదని, అందుకు బదులుగా పార్లమెంటు సీటు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

దాంతో ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తారని భావించారు. అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు బీసీలకు సీటు కేటాయించింది. కందుకూరు, కనిగిరి స్థానాల్లో బీసీలను పోటీకి దింపింది. ఆ పోటీగా టీడీపీ కూడా జిల్లాలో బీసీలకు సీటు తప్పకుండా ఇస్తారని ఆశ పెట్టుకున్నారు. ఇప్పటికే 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కనీసం ఒక్క బీసీకి కూడా సీటు కేటాయించలేదు. నూకసాని పేరును అసలు పరిగణలోకి తీసుకోలేదు. రెండో విడతలో అయినా టికెట్‌ వస్తుందని భావించారు.

పార్టీలో చేరకుండానే మాగుంటకు సీటు ?
నూకసాని బాలాజీ ప్రస్తుతం పార్టీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తానని చంద్రబాబు మాట ఇవ్వడంతో ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ ఒంగోలు నుంచి టీడీపీ తరఫున తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేయనున్నట్లు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సొంతంగా ప్రకటించుకోవడంతో నూకసాని ఖంగుతిన్నారు. ఇంకా పార్టీలో చేరని వ్యక్తి ఈ సీటు నాది అని ప్రకటించుకోవడమేమిటని పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ మాగుంటకు సీటు ఇవ్వాలనుకుంటే ఆ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు ప్రకటించాలి కానీ అందుకు విరుద్ధంగా మాగుంట ప్రకటించుకోవడం ఏమిటని చర్చించుకుంటున్నారు. ఇది టీడీపీ బలహీనతకు అద్దం పడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాఘవరెడ్డి పేరును ప్రస్తావిస్తూ పార్టీ ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేయడం బీసీల పట్ల టీడీపీ చిన్నచూపునకు ఇది నిదర్శనమని పార్టీ నేతలే చెబుతున్నారు.

డబ్బుల్తో వస్తే బీసీలను పక్కన పెడతారా...
ఒంగోలు పార్లమెంటు సీటు ఇస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు డబ్బున్న నాయకుడు రాగానే బీసీలను పక్కన పెట్టేశారని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే మాగుంట అనేక పార్టీలు మారారని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీడీపీలోకి అక్కడ నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి మళ్లీ ఇప్పుడు టీడీపీలోకి మారుతున్నారని, లిక్కర్‌ వ్యాపారాన్ని కాపాడుకునేందుకు తరచుగా పార్టీలు మారుతున్న మాగుంటకు వచ్చీ రాగానే రెడ్‌ కార్పెట్‌ పరచడమేంటి అని విమర్శిస్తున్నారు. పార్టీని నమ్ముకున్న బీసీల కంటే పార్టీలు మారే మాగుంటలే ఎక్కువయ్యారా అని మండిపడుతున్నారు.

అడుగడుగునా అవమానాలే..
పార్లమెంట్‌ అధ్యక్షుడైనప్పటికీ పార్టీ సమావేశాలకు పిలవకుండా, సమావేశాల్లో పాల్గొనకుండా అడుగడుగునా అవమానిస్తోంది. ఒకవైపు బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు బ్యాక్‌ బోన్‌లు అంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారికి తగిన ప్రాధాన్యత ఇస్తుంటే , మరోవైపు వెనకబడిన తరగతులు మా వెనకాలే నడవాలి, పెత్తనం మాత్రం మా చెప్పు చేతుల్లోనే ఉండాలంటూ టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ పార్టీలో సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులను ప్రోత్సహిస్తూ బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను వాడుకొని వదిలేస్తున్నాడన్న విమర్శలు వినవస్తున్నాయి. గత ఆదివారం నగరంలోని ఒక హోటల్‌లో టీడీపీ, జనసేన ఆత్మీయ సమావేశం జరిగింది.

ఎంతో కీలకమైన ఈ సమావేశంలో అటు టీడీపీ నాయకులు, ఇటు జనసేన నాయకులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి పార్టీ పార్లమెంటు అధ్యక్షుడైన నూకసానికి పిలుపులేదు. కనీస మర్యాదగా సమాచారం కూడా ఇవ్వలేదని తెలిసింది. సోమవారం టీడీపీ, జనసేన నాయకులు కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇంటికెళ్లి కలిశారు. కేవలం బీసీ అయినందునే నూకసానిని అవమానిస్తున్నారని ఆయన వర్గం విమర్శిస్తోంది. జిల్లా పార్లమెంటు అధ్యక్షుడైన నూకసాని భాగ్యనగర్‌లో జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

దామచర్ల గుంటూరు రోడ్డులో నగర కార్యాలయం పేరుతో సొంత కార్యాలయం ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రొటోకాల్‌ ప్రకారం రాష్ట్ర నాయకులు జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా కార్యాలయానికి రావలసి ఉంటుంది. కానీ జిల్లా కార్యాలయానికి రాష్ట్ర నాయకులను వెళ్లకుండా దామచర్ల అడ్డుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక సార్లు అధినాయకుడికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా సొంత సామాజికవర్గానికే వత్తాసు పలికారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు సైతం నూకసానిని ఆహ్వానించడం లేదు. ఒకవైపు పార్టీని నమ్ముకున్న బీసీలకు మొండిచేయి ఇస్తూ జయహో బీసీ, బీసీ డిక్లరేషన్‌ అంటూ నాటకాలాడుతున్నారని బీసీ నాయకులు విమర్శిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement