అనంతపురం అర్బన్ : హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ‘కరువుపై సమరం’ పేరుతో చేపట్టిన 24 గంటల మహాధర్నాను పోలీసులు భగ్నం చేశారు. గురువారం మహాధర్నా రెండో రోజుకు చేరింది. వామపక్ష నాయకులు కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు.. నాయకులను అరెస్ట్ చేయడానికి రంగంలోకి దిగారు. దీంతో గంట పాటు తోపులాట జరిగింది. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పెద్దఎత్తున నినదించారు.
చివరకు పోలీసులు నాయకులను అరెస్టు చేసి.. ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి డి.జగదీష్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పైలా నరసింహయ్య, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఓబులు, జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రమణ, ఐద్వా జిల్లా కార్యదర్శి సావిత్రమ్మ, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, రైతు సంఘం (సీపీఐ అనుబంధం) జిల్లా కార్యదర్శి కాటమయ్యతో పాటు మరికొందరు ఉన్నారు.
ఇక ప్రత్యక్ష యుద్ధమే : చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించా రు. మహాధర్నాలో ఆయన మాట్లాడారు. హామీలు తీర్చే వరకు ప్రభుత్వంపైప్రత్యక్ష యుద్ధం చేస్తామన్నారు. విత్తన వేరుశనగపై సబ్సిడీ తగ్గించడంతో జిల్లా రై తాంగంపై రూ. 28 కోట్ల భారం పడిందన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సామరస్యంగా ధర్నా చేస్తుంటే.. ప్రభుత్వం అధికారులను చర్చలకుపంపాల్సింది పోయి పోలీసులతో అరెస్ట్ చేయిస్తోందని మండిపడ్డారు.
ఉపాధి లేక వేల మంది గ్రామీణులు ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని తెలిపారు. పంటలు పండక రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో 47 మంది రైతులు, 17 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి ప్రజలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ జిల్లా సస్యశ్యామలం కావడానికి హంద్రీ-నీవా పూర్తి చేయాలని జిల్లా ప్రజలు కోరుతుంటే.. చంద్రబాబు మాత్రం బడ్జెట్‌లో రూ. 212 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. వెంటనే రూ. 2,500 కోట్లు కేటాయించి హంద్రీ-నీవాను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి, నారాయణస్వామి, రాజారెడ్డి, లింగమయ్య, కేశవరెడ్డి, గోపాల్ పాల్గొన్నారు.
మహాధర్నా భగ్నం
Published Fri, Jun 5 2015 4:12 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement