తిరుపతిలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో అవినీతిని క్రమబద్ధీకరించే తీర్మానం చేయాల్సి ఉండగా, సీఎం ...
రామసముద్రం: తిరుపతిలో జరిగిన టీడీపీ మహానాడు కార్యక్రమంలో అవినీతిని క్రమబద్ధీకరించే తీర్మానం చేయాల్సి ఉండగా, సీఎం చంద్రబాబు మరిచారని మదనపల్లె ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన రామసముద్రం మండలంలోని జంగాలపల్లె, ఆర్.కమతంపల్లె గ్రామాల్లో పర్యటిం చారు. ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. మహానాడు నిర్వహణ వ్యయం రూ.100 కోట్లతో ఒక నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందేదన్నారు. టీడీపీ ప్రభుత్వం కార్యకర్తల అవినీతిని ప్రోత్సహిస్తూ, నిజాయితీపరులమని గొప్పలు చెప్పుకోవడం దారుణమన్నారు. నీరు-చెట్టు, జన్మభూమి కమిటీ సభ్యులకే పనులు, ఆ పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందించడం అవినీతి కాదా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వివక్షత చూపితే ప్రజలు తరిమికొడతారన్నారు. ప్రత్యేకహోదా, అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాల ఊసే లేకుండా మహానాడు ముగించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపమన్నారు. ఓటుకు నోటు కేసుకు భయపడి చంద్రబాబు వాటిపై చర్యలు తీసుకోవడం లేదన్నారు. మహానాడులో తనను తాను పొగుడుకోవడం... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జెడ్పీటీసీ సీహెచ్.రామచంద్రారెడ్డి, సర్పంచు వెంకటప్ప, ఎంపీటీసీలు గంగప్ప, శంకర తదితరులు పాల్గొన్నారు.