శివయ్య పెళ్లికొడుకాయనే! | mahasivarathree special | Sakshi
Sakshi News home page

శివయ్య పెళ్లికొడుకాయనే!

Published Fri, Feb 20 2015 2:31 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

mahasivarathree special

శ్రీకాళహస్తి :  ముక్కంటీశుని కల్యాణం సర్వజగత్తుకే పండుగ. స్వర్ణముఖి నది తీరంలో ఆకాశమే పందిరిగా భూదేవి పీటగా పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. సాధారణంగా దేవతామూర్తుల కల్యాణోత్సవం వారి ఆలయాల్లో నిర్వహిస్తారు. అయితే ఇక్కడ సోమస్కంధుడు పట్టణం నడిబొడ్డున ప్రజల సమక్షంలో వివాహం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గజవాహనంపై వాయులింగేశ్వరుడు,సింహవాహనంపై జ్ఞానప్రసూనాంబ పెళ్లిమండపం వద్దకు గురువారం రాత్రి పయనమయ్యారు. అర్ధరాత్రి తర్వాత శాస్త్రోక్తంగా పూజారులు వివాహ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి సంప్రదాయం.
 వరుడుగా సర్వేశ్వరుడు కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని విభూదీశుడైన వాయులింగేశ్వరుడు అద్భుతమైన బంగారు స్వర్ణాభరణాలను ధరిం చాడు.

ముందుగా చండీకేశ్వరుడు, భృంగిరీటుడు, నికుంభధరుడు, భద్రకాలుడు తదితర ముక్కోటి దేవతలు సర్వేశురుని వెంట నిలిచారు. విభూదిని ఒకరు రాయగా, రుద్రాక్షమాలను మరొకరు అలంకరించగా, భిక్షపాత్ర ఒకరు, దివ్యాభరణాలను మరొకరు అలంకరించారు .పురాతనమైన అపురూప ఆభరణాలతో, పట్టువస్త్రాలతో, భారీ పూలమాలలతో, మంగళవాయిద్యాలతో పార్వతీ పరమేశ్వరులు పెళ్లిమండపానికి మందగమనంతో పయనమయ్యారు. ఉమాదేవి, సుబ్రమణ్యస్వామి సమేతుడైన సోమస్కంధమూర్తి గజవాహనంపై, జ్ఞానప్రసూనాంబ సింహవాహనంపై తేరువీధి నుంచి పెళ్లిమండపానికి బయలుదేరారు. ముందుగా గజవాహనంపై ఠీవిగా కూర్చున్న స్వామివారు రంగవల్లులు, మామిడితోరణాలు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతులు, అరటిచెట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణమండపానికి చేరుకోగా వాలుజడతో సిగ్గులొలకబోస్తూ ముందుకుసాగిన అమ్మవారు తేరువీధి దాటి నెహ్రువీధిలోకి ప్రవేశించి వాహనంతో సహా అక్కడే ఆగిపోయారు.

వేదపండితులు పవిత్ర మంత్రోచ్ఛారణతో మండపం వద్ద పూజలను ప్రారంభించారు. హోమం వెలిగించి కలశాలను ప్రతిష్ఠించి వివాహానికి సంబంధించిన కార్యక్రమాలను చేపట్టారు. ఈవో రామిరెడ్డితో పాటు అధికారులు నాయకులు, అనధికారులు భక్తుల సమక్షంలో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement