కిరణ్....పవన్....బీజేపీ... ఇండిపెండెట్?
కందుకూరు : 'ఏ పార్టీలోకి వెళ్దాం..? కిరణ్ పార్టీ, పవన్ పార్టీ, బీజేపీల్లో ఏదో ఒకటి చెప్పండి. లేదూ ఇండిపెండెంట్గా పోటీ చేయమంటారా...?' ఇవీ మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి తన నిజయోకవర్గ కార్యకర్తల ముందు ఉంచిన ఆప్షన్లు. కాంగ్రెస్ ఖాళీ అయిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి బయటకొచ్చే యోచనలో ఉన్న మహీధర్ రెడ్డి నిన్న మాచవరంలోని తన నివాసంలో గుడ్లూరు, ఉలవపాడు మండలాలకు చెందిన పలువురు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
'కిరణ్ కుమార్ రెడ్డి పెట్టే పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీలున్నాయి. వీటిలో ఏదో ఒక పార్టీలోకి వెళ్దామా? లేదంటూ ఇండిపెంటెండ్గా పోటీకి దిగమంటారా' అని మహీధర్ రెడ్డి కార్యకర్తలను ప్రశ్నించారు. కార్యకర్తల మనసులో వైఎస్ఆర్ సీపీనే ఉండడంతో మహీధర్ రెడ్డి ఇచ్చిన ఆప్షన్లకు ఎవరూ సమాధానం చెప్పలేదు. వైఎస్సార్ సీపీలోకి వెళ్దామని కొందరు అనడంతో ... ఆపార్టీలోకి వెళ్లేవారు ఇక్కడకు ఎందుకు వచ్చారంటూ ఆయన ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం.
కార్యకర్తలకు ఏ పార్టీలోకి వెళ్దామని ఆప్షన్లు ఇచ్చినప్పటికీ ఆయన మాటలను బట్టి చేస్తే ఇండిపెండెంట్గా బరిలోకి దిగేలా కనిపిస్తున్నారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ సీపీ టికెట్ దక్కదనే ఉద్దేశంతోనే కిరణ్, పవన్, బీజేపీ అని ఆయన ఆప్షన్లు ఇచ్చారని చెబుతున్నారు. పైగా ఆప్షన్లలో పేర్కొన్న పార్టీల గురించలి పెద్దగా చర్చించలేదని కార్యకర్తలు తెలిపారు.