సీఆర్డీఏ బిల్లులోని ప్రధాన అంశాలు
హైదరాబాద్: ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు శాసనసభలో కాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(సీఆర్డీఏ) బిల్లును ప్రవేశపెట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలాలలో ఏపీ కొత్త రాజధానిని నిర్మించనున్న విషయం తెలిసిందే. 17 చాప్టర్లు, 117 పేజీలతో సీఆర్డీఏ బిల్లును రూపొందించారు.
12,050 కోట్ల రూపాయలతో మూల నిధిని ఏర్పాటు చేయాలని నిర్ణయం. ప్రాధమికంగా వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. సీఆర్డీఏ చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తారు. 77 కిలోమీటర్ల పరిధిలోని రాజధానిపై పూర్తి అధికారాలు సీఆర్డీఏకే చెందుతాయి. పరిపాలనా బాధ్యతలు, పర్యవేక్షణకు స్పెషల్ కమిషనర్ను నియమిస్తారు. ల్యాండ్ పూలింగ్ బాధ్యతను కూడా సీఆర్డీఏకే అప్పగించారు.
ప్రధానంగా రాజధాని డెవలప్మెంట్ ప్లాన్, రాజధాని ప్రాంతపరిధిలోకి వచ్చే గ్రామాలు బిల్లులో వివరించారు. రాజధాని ప్రాంత భవిష్యత్ కోసం ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. మూడు దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఈ బిల్లు సభ ఆమోదం పొందిన తరువాత గవర్నర్ దగ్గరకు వెళ్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గవర్నర్ ఆమోదం పొందిన తరువాత భూసేకరణకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. భూసేకరణ సమయంలో భూములు ఇస్తున్నట్లు రైతుల నుంచి అఫిడవిట్లు తీసుకుంటామన్నారు. విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి (వీజీటీఎం) పరిధిలోని ఆస్తులు, అప్పులు సీఆర్డీఏ పరిధిలోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్ర నిర్ణయం వచ్చే ఏడాది మార్చిలోపు తెలుస్తుందని యనమల తెలిపారు.