ప్రిసైడింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం
ఒంగోలు టౌన్ : జిల్లాలో ఈ నెల 9న జరగనున్న శాసనమండలి ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. సోమవారం స్థానిక పాత జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశపు హాలులో ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైందన్నారు.
పోలింగ్ కేంద్రానికి ముందుగానే చేరుకొని బ్యాలెట్ బాక్స్‌లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముందుగా ఖాళీ బ్యాలెట్ బాక్స్‌లు పోలింగ్ ఏజెంట్లకు చూపించి పేపర్ సీల్‌పై వారి సంతకాలు తీసుకొని క్రమపద్ధతిలో అమర్చాలని సూచించారు. అంతకు ముందు పోలింగ్ ఏజెంట్లు, వారి అభ్యర్థుల సంతకాలు పరిశీలించి సరిచూసుకొని వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్ల ఎడమచేయి చూపుడు వేలుకు సిరా గుర్తు చేయాలన్నారు.
పోలింగ్ కేంద్రంలోకి పోలింగ్ సిబ్బంది, ఏజెంట్లు, పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి ఎన్నికల ఏజెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, జోనల్ అధికారులు, ఎన్నికల పరిశీలకులు, ఓటర్లను, దివ్యాంగులకు సహాయకులు, బీఎల్‌ఓలు, చంటిబిడ్డలతో వచ్చే మహిళలను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. ఎన్నికలను క్రమశిక్షణతో హుందాగా నిర్వహించాలని సూచించారు. తొలుత బ్యాలెట్ బాక్స్‌లు సీల్‌వేసే విధానం, పోలింగ్ ప్రక్రియను జిల్లా పరిషత్ సీఈఓ బాపిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కొండయ్యలు వివరించారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించాలి
Published Wed, Mar 8 2017 12:03 AM | Last Updated on Thu, Mar 21 2019 8:29 PM
Advertisement