వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాల్లో ఘటనలు
పలు బ్యాలెట్ బాక్సులు దగ్ధం
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు బ్యాలెట్ డ్రాప్ బాక్స్‌లకు నిప్పు పెట్టారు. సోమవారం జరిగిన వేర్వేరు ఘటనల్లో ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో మూడు బ్యాలెట్ డ్రాప్‌బాక్స్‌లు కాలిపోగా, వాషింగ్టన్, వాంకోవర్‌లో పెద్దసంఖ్యలో దగ్ధమైనట్లు వార్తలొచ్చాయి. అక్టోబర్ 8వ తేదీన వాంకోవర్‌లో జరిగిన ఘటనలో బ్యాలెట్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని అధికారులు వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు నిప్పు పెట్టారని పోర్ట్‌లాండ్ పోలీస్ అసిస్టెంట్ ఛీఫ్ అమాండా మెక్‌మిల్లన్ తెలిపారు.
వాషింగ్టన్, ఒరెగాన్ రాష్ట్రాల్లో జరిగిన ఈ చర్యలపై గుర్తుతెలియని నిందితులపై విధ్వంసక పరికరాన్ని కలిగి ఉండటం, ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. వాంకోవర్‌లో సోమవారం బ్యాలెట్ డ్రాప్ బాక్సుల నుంచి పొగలు వస్తుండటంతో పోలీసులు బ్యాలెట్ బాక్స్ పక్కన ఉన్న అనుమానాస్పద పరికరాన్ని తొలగించారు. ఒరెగాన్‌లోని పోర్ట్‌లాండ్‌లో బ్యాలెట్ బాక్స్‌లో సోమవారం ఉదయం ఇలాంటి మరో ఘటనే జరిగింది. ఈ ఘటనలో మూడు బ్యాలెట్లు మాత్రమే దెబ్బతిన్నాయని, మరోసారి ఓటు వేసేలా ఆ ఓటర్లను సంప్రదిస్తామని కౌంటీ ఎన్నికల డైరెక్టర్ తెలిపారు.
తమ బ్యాలెట్ లెక్కలోకి వచ్చిందో లేదో స్టేటస్‌ను ఆన్‌లైన్లో చెక్‌చేసుకుని, పరిగణనలోకి రాకపోతే ప్రత్యామ్నాయం కోసం అభ్యర్థించాలని వాషింగ్టన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం ఓటర్లకు సూచించింది. వాంకోవర్‌లో డెమొక్రటిక్ ప్రతినిధి మేరీ గ్లూసెన్‌కాంప్ పెరెజ్, రిపబ్లికన్ ప్రత్యర్థి జోకెంట్ బరిలో ఉన్నారు. బ్యాలెట్ డ్రాప్ బాక్సులకు పోలీసులు రాత్రిపూట రక్షణగా ఉండాలని గ్లూసెన్‌కాంప్ పెరెజ్ డిమాండ్ చేశారు.
ఫీనిక్స్‌లో గురువారం మెయిల్‌బాక్స్‌ను తగలబెట్టిన ఘటనలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో దాదాపు 20 బ్యాలెట్లు ధ్వంసమైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వాషింగ్టన్ రాష్ట్రంలో చట్టబద్ధమైన, నిష్పాక్షిక ఎన్నికలకు విఘాతం కలిగించే అతివాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని అమెరి కా విదేశాంగ మంత్రి స్టీవ్ హాబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లందరూ సురక్షితంగా ఎన్నికల్లో పాల్గొనేలా చూసే అధికారుల సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment