‘రచ్చబండ’ను విజయవంతం చేయాలి'
Published Fri, Nov 8 2013 2:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌లైన్ :జిల్లా వ్యాప్తంగా ఈ నెల 11 నుంచి 26 వరకు అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో నిర్వహించే మూడో విడత రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నీతూ ప్రసాద్ ఆదేశించారు. రచ్చబండ, ఉపాధి హామీ, వ్యక్తిగత మరుగుదొడ్లు, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై గురువారం కలెక్టరేట్ విధాన గౌతమిహాలులో ఆమె ఎండీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అక్టోబర్ 24వ తేదీ వరకు అర్హులుగా గుర్తించిన లబ్ధిదారులకు ముందుగానే స్లిప్‌లు ఇచ్చి వారిని రచ్చబండ కార్యక్రమానికి తీసుకురావాలన్నారు. రచ్చబండ కార్యక్రమంలో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహనిర్మాణ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ ఉంటుందన్నారు. అలాగే ఇందిరమ్మ కలలు కార్యక్రమం కింద మంజూరు చేసిన వివిధ
పనులకు శంకుస్థాపనలుంటాయన్నారు.
అలాగే ఎస్సీ,ఎస్టీ కుటుంబాలకు విద్యుత్ బకాయిలు చెల్లిస్తారన్నారు. బంగారుతల్లి సర్టిఫికెట్‌లు, ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ మంజూరు చర్యలు చేపడతామన్నారు. మండలస్థాయిలో ఎండీవో నేతృత్వంలో తహశీల్దార్, డ్వామా, డీఆర్‌డీఏ ఏపీవోలు, విద్యుత్, హౌసింగ్ శాఖల ఏఈలు, ఇన్‌చార్జి మంత్రిచే నియమితులైన సర్పంచ్, ఒక మహిళా సభ్యురాలు, మరో సభ్యునితోపాటు ఇతర మండలస్థాయి అధికారులతో మండల టీం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అలాగే మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ నేతృత్వంలో ఇన్‌చార్జి మంత్రి నామినేట్ చేసిన ముగ్గురు సభ్యులతోపాటు మున్సిపాలిటీ పరిధిలోని ఇతర అధికారులు పాల్గొంటారన్నారు. వెంటనే సంబంధిత శాసనసభ్యులను సంప్రదించి మండలాలవారీ రచ్చబండ కార్యక్రమం తేదీలను ఖరారు చేసి పంపాలని ఎండీవోలను ఆదేశించారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్లు, స్త్రీశక్తి భవనాల నిర్మాణం, ఉపాధిహామీ పథకం, ఉద్యానవన పంటలు, మైక్రో ఇరిగేషన్ తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో సీపీవో మహిపాల్, హౌసింగ్‌పీడీ సెల్వరాజ్, డీఆర్‌డీఏ పీడీ చంద్రశేఖరరాజు, పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకటేశ్వరరావు, డ్వామా ఇన్‌చార్జి పీడీ మల్లిబాబు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement