సీతంపేట: గిరిజనులకు అందజేస్తున్న ట్రైకార్ రుణాలు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. బుధవారం సీతంపేట ప్రభుత్వోన్నత పాఠశాల మైదానంలో ఎస్సీ, ఎస్టీలకు సబ్సీడీ బ్యాంకు రుణాలను పంపిణీ చేశారు. రూ.6 కోట్ల ట్రైకార్ రుణాలు, ఎస్‌హెచ్‌జీలకు బ్యాంకు లింకేజీలు రూ.రూ.5 కోట్లు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రూ.165 కోట్లతో 80,847 మంది లబ్ధిదారులకు సబ్సిడీ, బ్యాంకు రుణాలను అందజేసినట్టు తెలిపారు. గిరిజన నిరుద్యోగులకు రాష్ట్రంలో 22 నైపుణ్యాభివృద్ధి శిక్షణా సంస్థల ద్వారా ఉపాధి శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసకుంటామన్నారు. గిరిజన విద్యార్థుల కోసం ఎన్‌టీఆర్ విద్యోన్నతి, అంబేడ్కర్ ఓవర్సీస్ వంటి పథకాలు ప్రవేశపెట్టామని, వాటిని వినియోగించుకోవాలని చెప్పారు.
అలాగే యువతులు వివాహం చేసుకోవడానికి గిరిపుత్రిక కల్యాణ పథకం కింద రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేయనున్నట్టు తెలిపారు. గిరిజనులకు చట్టబద్ధంగా రావలసిన ఉప ప్రణాళికలను మంజూరు చేసి వాటిని సక్రమంగా వినియోగించడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి పరిశీలించారు. హడ్డుబంగి విద్యార్థినులు చేసిన జానపద నృత్యాలను చూసి అభినందించారు.
కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నిమ్మక జయకృష్ణ, తోటపల్లి ప్రాజెక్టు చైర్మన్ పాండురంగ, ఎంపీటీసీ బి.దమయంతి, సర్పంచ్ ఎ.భారతి, కలెక్టర్ లక్ష్మీనృసింహం, ఐటీడీఏ పీఓ జె.వెంకటరావు, ఆర్డీఓ గున్నయ్య, ఈఈ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఆదిత్యలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయక్, సీఎంఓ శ్రీనివాస్, పీఏఓ జగన్‌మోహన్, ఏపీడీ సావిత్రి, పీహెచ్‌ఓ కర్ణ, డిప్యూటీ డీఈఓ వి.మల్లయ్య, తహశీల్దార్ సావిత్రి, డీపీఓ సతీష్, ఈఓపీఆర్‌డీ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి కోసం గిరిజనుల నిరీక్షణ
సీతంపేట: రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్‌బాబు బుధవారం సీతంపేట పర్యటన సందర్భంగా మహిళా సంఘాలు, ట్రైకార్ రుణాల లబ్ధిదారులకు అవస్థలు తప్పలేదు. మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం ఉంటుందని, అనంతరం రుణాల పంపిణీ చేస్తారని అధికారులు చెప్పడంతో సీతంపేటతో పాటు వివిధ మండలలా నుంచి భారీ స్థాయిలో ప్రజలు, లబ్ధిదారులు ప్రభుత్వోన్నత పాఠశాల మైదానానికి చేరుకున్నారు. అయితే సాయంత్రం నాలుగున్నర గంటలకు మంత్రి సమావేశానికి హాజరయ్యారు. అంతవరకు లబ్ధిదారులకు నిరీక్షణ తప్పలేదు. అయితే, సమావేశం కూడా గిరిజనులకు నిరాశే మిగిల్చింది.
తాగునీటి సమస్య పరిష్కారానికి ఎటువంటి స్పందన లేదు. కేవలం నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు గాని ప్రస్తుత సమస్య ఎలా అధిగమించాలనేది స్పష్టం చేయలేదు. అలాగే, రుణమాఫీ, హుదూద్ పరిహారం, ఏనుగుల సమస్య వంటి వాటి ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ప్రసంగమంతా సీఎం చంద్రబాబునాయుడు అభివృద్ధి చేస్తున్నారని, తన గురించి తాను చెప్పుకునే సరికే సమయం అయిపోయింది. అంతకుముందు మంత్రి గిరిజనులతో నృత్యాలు చేశారు. మొత్తం మీద మంత్రి పర్యటనలో కొత్తదనం లేదని పలువురు గిరిజనులు వాపోవడం గమనార్హం.
ఎమ్మెల్యేల గైర్హాజరు
జిల్లా మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో చర్చనీయూంశమైంది. ఇటీవల జరిగిన పాలకవర్గ సమావేశంలో పలాస ఎమ్మెల్యే శివాజీ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ మంత్రి జిల్లాకు వచ్చి ‘ఏం చేస్తారు, ఆయన వచ్చి థింసా నృత్యం చేసి, ఉపన్యాసం ఇచ్చి వెళతారు’ అనే వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. విపక్ష ఎమ్మెల్యేలు ఈ పర్యటన తో ఒరిగిందేమీ లేదని మిన్నకుండిపోగా కనీసం స్వపక్ష ఎమ్మెల్యేలు పాల్గొనకపోవడం గిరిజన మంత్రి ఏకాకి అయి పర్యటన మమ అనిపించారు.
ట్రైకార్ రుణాలను సద్వినియోగం చేసుకోండి
Published Thu, Feb 25 2016 12:26 AM | Last Updated on Wed, Aug 29 2018 7:45 PM
Advertisement
Advertisement