రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ సభకు ఉద్యోగులు, కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించే లక్ష్యంతో ఏర్పాటవుతున్న సభకు బాసటగా నిలుస్తామని ఆయా సంఘాల నాయకులు పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం నినదించే ఉద్యమ శక్తులకు ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రల గోడును కూడా సభ వేదిక మీద నుంచి వినిపించాలని కోరారు. ప్రభుత్వంలో ఆర్‌టీసీ విలీనానికి మద్దతుగా నిలవాలని వైఎస్సార్ కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది
సమైక్యవాదానికి ఉద్యోగుల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇందులో రెండో ఆలోచనకు తావు లేదు. సమైక్య ఉద్యమ శక్తులకు మద్దతుగా నిలుస్తాం. సమైక్య శంఖారావం సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం.
- అశోక్‌బాబు, ఏపీఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు
సమైక్య శంఖారావం విజయవంతం కావాలి
ప్రజల ఆకాంక్షలను బలంగా వినిపించనున్న సమైక్య శంఖారావం సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే లక్ష్యంతో ఏర్పాటయ్యే సభలు, సమావేశాలకు ఉద్యోగుల మద్దతు ఉంటుంది.
- చంద్రశేఖరరెడ్డి, ఏపీఎన్‌జీవో సంఘం ప్రధాన కార్యదర్శి
సమైక్య శంఖారావానికి సంఘీభావం
రాష్ట్ర రాజధానిలో సమైక్యవాదాన్ని చాటిచెప్పడానికి ఏర్పాటు చేయనున్న సమైక్య శంఖారావం సభకు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ మద్దతు ప్రకటిస్తున్నాం.
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షడు
అన్ని వర్గాలు పాల్గొనాలి
సమైక్యవాదాన్ని వినిపించే ఏ సభకైనా ఉద్యోగులుగా మద్దతు ఇస్తాం. సమక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులతో పాటు అన్ని వర్గాలు పాల్గొనాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రజల ఆకాంక్షను సభలో బలంగా వినిపించాలి.
- రవికుమార్, ట్రెజరీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలి
సమైక్య శంఖారావం సభను విజయవంతం చేయడానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొంటాం. విభజన వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే దిశలో సాగుతున్న ఉద్యమంలో సమైక్య శంఖారావం సభ మైలురాయిగా నిలవాలి.
- వెంకట్రామిరెడ్డి, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు
ఏ పార్టీ ఉద్యమించినా మున్సిపల్ ఉద్యోగులు అండగా నిలుస్తారు:
వైఎస్సార్‌సీపీ నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అండగా నిలుస్తాం. స్వచ్ఛందంగా సభకు తరలి రావాలని పిలుపునిస్తున్నాం. రాష్ట్ర విభజన వల్ల ఇరు రాష్ట్రాల ఆదాయం గణనీయంగా తగ్గిపోతుంది. రెవెన్యూ రాబడి తగ్గితే తొలి ప్రతికూల ప్రభావం పట్టణీకరణ మీదే పడుతుంది.
- కృష్ణమోహన్, మున్సిపల్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్
రాయలసీమ, ఉత్తరాంధ్ర గోడు వినిపించాలి
తెలంగాణ కంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతాలు అభివృద్ధి జరగకముందే విభజన జరిగితే.. ఉత్తరాంధ్ర, సీమ తీవ్రంగా నష్టపోతాయి. రాయలసీమ ఏడారిగా మారిపోతుంది. సమైక్య శంఖారావం సభలో.. రాయలసీమ, ఉత్తరాంధ్ర గోడు వినిపిస్తారని ఆశిస్తున్నాం. ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రతిపాదనకు వైఎస్సార్ సీపీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- సి.హెచ్.చంద్రశేఖరరెడ్డి, ఆర్‌టీసీ ఈయూ అధ్యక్షుడు
సమైక్య శంఖారావం సభకు మా అండ
సమైక్యవాదాన్ని విపిపించే సమైక్య శంఖారావం సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ప్రతిపాదనకు సమైక్యవాద పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- పి.వి.రమణారెడ్డి, ఎన్‌ఎంయూ సమైక్యాంధ్ర స్టీరింగ్ కమిటీ నేత
ప్రతి సమైక్యవాదీ సమైక్య శంఖారావంలో పాల్గొనాలి
రాజకీయాలకు అతీతంగా ప్రతి సమైక్యవాదీ సమైక్య శంఖారావంలో పాల్గొనాలి. ప్రధానంగా హైదరాబాద్, తెలంగాణలో ఉన్న సమైక్యవాదులు పెద్ద సంఖ్యలో సభకు తరలిరావాలి. గతంలో విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చిన పార్టీలు కూడా వైఖరి మార్చుకొని రాష్ట్ర సమగ్రతను కాపాడాల్సిన సమయం ఇదే.
- వి.లక్ష్మణరెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక కోఆర్డినేటర్