ఎల్బీ స్టేడియంలో 19న సమైక్య శంఖారావం: వైఎస్ఆర్సీపీ
ఎల్బీ స్టేడియం వేదికగా సమైక్య శంఖారావం సభను నిర్వహించేందుకు అక్టోబరు 19న వైఎస్ఆర్ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. సమైక్యరాష్ట్రం కోసం వైఎస్సార్‌సీపీ భారీ సభను ఈనెల 19న నిర్వహించనుంది.
ఈనెల 19న హైదరాబాద్‌లో చేపట్టబోయే సమైక్య శంఖారావం సభకు అనుమతి ఇవ్వాలని డీజీపీ ప్రసాదరావుని కలిసిన వైఎస్‌ఆర్ సీపీ నేతలు కలిశారు. డీజీపీని కలిసిన తర్వాత మీడియాతో వైఎస్ఆర్ సీపీ నేతలు జూపూడి ప్రభాకర్ రావు, గట్టు రామచందర్ రావు, జనక్‌ప్రసాద్, శివకుమార్ మాట్లాడుతూ.. సభకు అనుమతివ్వాలని డీజీపీని కోరాం అని అన్నారు.
స్థానిక డీసీపీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని డీజీపీ అన్నారని వైఎస్ఆర్సీపీ నేతలు తెలిపారు. గత మూడేళ్లుగా ఎక్కడ పర్యటించినా..శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. శాంతియుత పంథాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పయనిస్తోంది అని జూపూడి అన్నారు. రాజ్యాంగం ప్రకారం..విభజన, సమైక్యం ఎదైనా అభిప్రాయాన్ని..చెప్పుకునే హక్కు అందరికీ ఉంది అని గట్టు అన్నారు.