కనువిప్పే ఢిల్లీ కర్తవ్యం | State bifurcation: Realisation is the first and foremost task for UPA government | Sakshi
Sakshi News home page

కనువిప్పే ఢిల్లీ కర్తవ్యం

Published Sat, Oct 26 2013 1:03 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

కనువిప్పే ఢిల్లీ కర్తవ్యం - Sakshi

కనువిప్పే ఢిల్లీ కర్తవ్యం

యూపీఏ-2 చీకటి బాగోతం ప్రజలకు నరకం చూపించింది. కుంభకోణాలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడున్న పరిణామాలను బట్టి రేపటి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు కట్టబెట్టినా, అవి కాంగ్రెస్ హ్యాట్రిక్‌కు మాత్రం దోహదం చేయలేవు. ఏ సర్వే చూసినా ఇదే చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ 272కు ఆమడదూరంలోనే  ఆ పార్టీ ఉండబోతున్నట్టు అంచనా.  రాజకీయ పార్టీల ‘అభిప్రాయాల’ పుణ్యమా అని తలెత్తిన ఈ కల్లోలానికి సమాధానం చెప్పాలని కంకణం కట్టుకున్న వైఎస్‌ఆర్‌సీపీ 26న ‘సమైక్య శంఖారావం’ పూరించబోతున్నది. 
 
 స్వతంత్రం వచ్చాక వ్యవస్థల పునర్ నిర్మాణం జరగాలి. మన దేశం కూడా అందుకు ప్రయ త్నించింది. స్వాతంత్య్రం ఇచ్చిన స్ఫూర్తితోనే మేరునగధీరులైన నాటి రాజనీతిజ్ఞులు, మేధావు లు, కవులూ కళాకారులు మన సావాచా నమ్మారు. అందులో భాగమే తెలుగువారికి ఒక రాష్ట్రం. తెలుగువారంతా ఒకే ఛత్రంకింద ఉండాలని ప్రజా కవులు, గాయకులు గానం చేశారు.‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అందరి నాల్కల మీద నడయాడింది ఆ రీతిలోనే. తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అందుకు ఎన్టీఆర్ ‘చేయెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి గలవోడా!’ (వేములపల్లి శ్రీకృష్ణ గేయం) లీడ్ సాంగ్ చేసు కున్నారు. ఆంధ్రమహాసభ నాయకత్వంలో సాగిన తెలం గాణ సాయుధ పోరాట లక్ష్యాల్లో విశాలాంధ్ర స్థాపన ఒక టన్నది ఎలా విస్మరిస్తాం? ఆ పోరాట యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల సోదరులు, ఆరు ట్ల కమలాదేవి వంటి ఎందరో సమైక్యతనే చాటి చెప్పారు. బూర్గుల రామకృష్ణారావు లాంటి వారి అసమాన త్యాగాల వల్లనే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. ఆనాడు కాంగ్రెస్‌లోని మితవాదవర్గం వ్యతిరేకించినా, వారి ఆటలు, అపశ్రుతు లు ఆంధ్రప్రదేశ్ అవతరణను అడ్డుకోలేకపోయాయి. నెహ్రూ మాటను ఎవరూ కాదనలేకపోయారు. ఆంధ్రప్ర దేశ్ అవతరణలో భాగస్వాములు కానివారూ, పదవుల కోసం ఆరాటపడేవారు విభజన వాదాన్ని అందుకున్నారు. 
 
 సమైక్యాంధ్రకు చక్కటి రాజధాని
 దేశంలో మేటి నగరంగా హైదరాబాద్‌కు మంచి భవిష్యత్తు ఉన్నదని భావిస్తున్న తరుణంలో ఈ విభజన నిర్ణయం ఆ నగరాన్ని గందరగోళంలో పడేసింది. కేవలం డబ్బుతో చక్కటి రాజధాని సిద్ధించదు. ఈ 57 ఏళ్లలో భాగ్యనగరం అన్ని హంగులతో చక్కటి రాజధానిగా రూపొందింది. ఎన్ని ప్రతిష్టాత్మక సంస్థలు విద్య, వైద్య, వ్యాపార రంగా లలో నెలకొన్నాయో! ఐదు లక్షల కోట్లు కాదు, పది లక్షల కోట్లు ఖర్చు చేసినా; పదికాదు, ముప్ఫై ఏళ్లయినా అటు వంటి మరో నగరాన్ని నిర్మించలేము. అంత ఆదాయం చేకూర్చగల నగరం సాధ్యమా? కొత్త రాజధాని కోసం కొందరు అంచనా వేస్తున్న ఆ పది లక్షలతో రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు, జిల్లాలకు అభివృద్ధి ప్యాకేజీలు ఇవ్వవచ్చు. జలయజ్ఞాన్ని వేగంగా పూర్తి చేయవచ్చు. ప్రతి జిల్లాకు ఒక విమానాశ్రయం, ఒక విశ్వవిద్యాలయం అన్న వైఎస్ కలను సాకారం చేయవచ్చు. ప్రతి స్కూలుకు టాయిలెట్ సమకూర్చవచ్చు. ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు, టాయిలెట్ సౌకర్యం కలిగించవచ్చు. సమై క్యాన్ని అలాగే ఉండనివ్వండి. రాజధానిని గురించిన సీమాంధ్రుల కలలను వికలం కానీయరాదు. కొత్త రాజ ధాని మీద పెట్టే ఖర్చంతా అనుత్పాదకమైందే.
 
 దిగ్విజయ్ లిటిగెంటు
 విభజనకు ప్రధాన పక్షాలన్నీ సమ్మతించాయట. అందుకే ఈ నిర్ణయమట. సోనియా ముచ్చట తీర్చడానికి కాదట! ఇందులో రాజకీయమే లేదట! ఎనభై రోజులు దాటిపో యినా, ఇంకా సాగుతున్న కోట్లాది సీమాంధ్ర జనఘోష సైతం దిగ్విజయ్‌సింగ్‌కు వినపడలేదట! కనబడలేదట! పైగా తగ్గుముఖం పట్టిందట! కాంగ్రెస్ వారు ఎవరైనా, ఎమ్మెల్యేలైనా, మంత్రులైనా, ఎంపీలైనా ప్రతి ఒక్కరు అధి ష్టానం నిర్ణయానికి కట్టుబడాల్సిందేనట! అంటే ఎన్ను కున్న ప్రజలు దిగ్విజయ్ దృష్టిలో దద్దమ్మలు. మనకు స్వాతంత్య్రం సాధించి పెట్టిందీ, రాజ్యాంగాన్ని ఇచ్చింది ప్రజలు కాదా? రాజకీయ పక్షాలు మాట ఇచ్చాయి, కాబట్టి ప్రజల ఆకాంక్ష ఏమైనా, వారి ఘోష ఏైదైనా రాజకీయ పక్షాలు ఇచ్చిన మాట వల్ల మరచిపోవలసిందేనని దిగ్వి జయ్ భాష్యం చెప్పడం కక్షిదారుని మనస్తత్వం. 
 
 ఈ 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్నిరంగాల్లోనూ అభివృద్ధి చెందింది. ఈ విషయాన్నే జస్టిస్ శ్రీకృష్ణకమిటీ ఘంటాపథంగా చెప్పింది. తెలంగాణ కంటే రాయలసీమ వెనుకబడిందని వెల్లడించింది. హైద రాబాద్ పది జిల్లాలకు రాజధాని కావటంకంటే 23 జిల్లాల రాజ ధాని కావటం ఎంతో మేలని రావి నారాయణరెడ్డి చెప్ప లేదా? రాజధాని ప్రభావం చుట్టూ ఉన్న రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల మీద పడిం ది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. భూముల ధరలు పెరి గాయి. వైఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాంతీయ అసమానతల మీద దృష్టి పెట్టి, తెలంగాణపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. చంద్రబాబు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకొని వారిని అనాథలనుచేస్తే, వైఎస్ ఆ జిల్లాకు చెందిన కల్వకుర్తి, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు వేల కోట్లు ఖర్చు పెట్టి, పనులను పరుగులు తీయించాడు. ఏ ఇతర జిల్లాకు పెట్టనంత ఖర్చు ఆ జిల్లాకు పెట్టాడు. 
 
 పచ్చటి తెలంగాణ వైఎస్ కల
 తెలంగాణను కోసాంధ్ర స్థాయికి పెంచాలని వైఎస్ ఆశ. ఆ ఉద్దేశంతోనే తెలంగాణలోని ఆరు జిల్లాలో 16 లక్షల ఎకరా లకు నీరందించే ప్రాణహిత చేవెళ్ల భారీ పధకాన్ని సర్వే చేయించి శంకుస్థాపన చేశారు. ఆ పధకాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేస్తున్న సమ యంలో కన్నుమూశారు. వైఎస్ అధికారం స్వీకరించిన వెంటనే తొలి సంతకం చేసింది ఉచిత విద్యుత్ పధకం మీదనే! దానితో ఎక్కువ లబ్ధి చేకూరినది తెలంగాణకే. రాష్ట్రంలో 32 లక్షల పంపుసెట్లు ఉంటే అందులో తెలం గాణలోనే 18 లక్షలు ఉన్నాయి. వారి విద్యుత్ బకాయిలు రద్దయ్యాయి. విద్యుత్ కేసులు మాఫీ అయ్యాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన గోదావరి మీద నిర్మి స్తున్న భారీ ఎత్తిపోతల పధకాలకు భారీ స్థాయిలో విద్యు త్తు అవసరం. వాటికి మాత్రమే ఆరువేల మెగావాట్ల విద్యుత్తు అవసరం. విభజన జరిగితే ఈ ఖర్చు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద గుదిబండ కాగలదు. ఆరుసూత్రాల పధకం లోని 610 జీవో ఉల్లంఘనలను పరిశీలించి, సరిచేయడా నికి వైఎస్ శ్రద్ధ తీసుకున్నారు. అందుకు తెలంగాణ మం త్రులతోటి ఒక ఉపసంఘాన్ని నెలకొల్పారు.ఇవన్నీ సౌల భ్యం కోసం నాయకులు విస్మరిస్తున్నారు. కానీ ప్రజలు మరచిపోతారని అనుకోలేం.
 
 జలయుద్ధాలను ఆపగలరా?
 నీటి యుద్ధాలు వర్తమాన భారత, అంతర్జాతీయ దృశ్యం. వీటిని నివారించాలంటే సమైక్యతతోనే సాధ్యం. దీనిని గుర్తించబట్టే వైఎస్ జల యజ్ఞాన్ని రూపొందించి, తాను మరణించే నాటికి సుమారు 40 వేల కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్టులకు ఖర్చు చేసి, వాటి నిర్మాణాన్ని వేగవంతం చేయించారు. కేంద్రం ఇప్పుడు ఆహారభద్రత అంటూ ఒక చట్టం చేసి ఉండవచ్చు. కానీ వైఎస్ జీవించి ఉండగానే ఆహార భద్రత, కరువుల నివారణ అన్న రెండు లక్ష్యాలతో జలయజ్ఞానాన్ని రూపొందించాడు. కృష్ణ నీరు ప్రతి బొట్టు వినియోగం జరుగుతోంది. గోదావరి నీరు ప్రతి ఏటా 2 వేల నుంచి 3 వేల టీఎంసీల వరకు సముద్రం పాలవుతోం ది. ఆ నీటిలోని 20 శాతమైనా సద్వినియోగం చేసుకోగలి గితే కరువుసీమ ప్రజల వెతలు తీరుతాయి. కర్ణుని చావుకి కారణాలు ఎన్నో! సీమకు ఉన్న శాపాలెన్నో! చరిత్ర తెలిసి కొందరు, తెలియక కొందరు మాట్లాడుతున్నారు. వాస్తవా లను మరుగుపరచడం విజ్ఞత కాదు. సీమాంధ్ర ఎడారి కాకుండా ఉండాలంటే సమైక్య రాష్ట్రం నిలబడాలి.
 
 కుమ్మక్కులు ముంచాయి!
 సీల్డ్ కవర్ ముఖ్యమంత్రినని కిరణ్ కుమార్ తిరుగులేకుం డారుజువు చేసుకున్నాడు. తన జీవితంలో ఊహించని విధంగా ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకు సోనియాకు పరమ విధేయుడుగా ఉండాలి. పీసీసీ అధ్యక్షుడు బొత్స కూడా అంతే. కానీ 2014 ఎన్నికల్లో ప్రజలకు ముఖం చూపించాలంటే సమైక్యవాదులం అన్న ముసుగు తగిలిం చుకు తీరాలి. వారిద్దరూ మొదటనే రాజీనామా చేసి ఉంటే ప్రజలకు ఈ బాధలు తప్పేవి. రాజకీయాల్లో మ్యాచ్ ఫిక్సింగ్‌కు చంద్రబాబు ప్రతీకగా మారాడు. వైఎస్ అనం తర రాజకీయాలు భ్రష్టుపట్టడానికి ఈ నేతలే కారణం. రాష్ట్రం కష్టాలు, నష్టాలు ఎలా ఉన్నా రాహుల్‌గాం దీని గద్దెనెక్కించడమే ధ్యేయంగా సోనియా ఈ నాటకం ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయత్నం విజయవంతమయ్యే సూచనలే లేవు. యూపీఏ-2 చీకటి బాగోతం ప్రజలకు నరకం చూపించింది. 
 
 కుంభకోణాలు దేశ ప్రతిష్టను దిగజార్చాయి. ఇప్పుడున్న పరిణామాలను బట్టి రేపటి ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు కట్టబెట్టినా, అవి ఆ పార్టీ హ్యాట్రిక్‌కు దోహదం చేయలేవు. ఏ సర్వే చూసినా ఇదే చెబుతోంది. మ్యాజిక్ ఫిగర్ 272కు ఆమడదూరంలోనే ఆ పార్టీ ఉండబోతున్నట్టు అంచనా.  రాజకీయపార్టీల ‘అభిప్రాయాల’ పుణ్యమా అని తలెత్తిన ఈ కల్లోలానికి సమాధానం చెప్పాలని కంకణం కట్టుకున్న వైఎస్‌ఆర్‌సీపీ 26వ తేదీన ‘సమైక్య శంఖారావం’ పూరించ బోతున్నది. ఇది న్యాయం కోసం ఆక్రోశిస్తున్న జనాల ఘోష. చరిత్రనీ, నిన్నటి త్యాగాలనీ అవహేళన చేస్తున్న వైఖరికి, పెడార్థాలు తీసే ధోరణికి జవాబు చెప్పే ప్రయ త్నం. ఇదైనా ఢిల్లీ పెద్దలకు కనువిప్పు కలిగించాలి.
 - ఎన్.శివరామిరెడ్డి, మాజీ శాసన సభ్యులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement