సమైక్య శంఖారావానికి చురుగ్గా ఏర్పాట్లు
ఈ నెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివస్తున్నట్టు నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి సమాచారం పంపిస్తున్నారు. పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుపుతున్నారు. సభకు భారీఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేయాలని పార్టీ నిర్ణయించింది. సమైక్య శంఖారావం ద్వారా ప్రజల మనోభావాలను మరోసారి ఢిల్లీకి వినిపించాలని నిర్ణయించిన పార్టీ అందుకు ఏర్పాట్లను రోజూ సమీక్షిస్తోంది. ఉద్యోగ, కార్మిక, కర్షక సంఘాలు కూడా సమైక్య శంఖారావానికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లపై పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
మంగళవారం ఆయన హైదరాబాద్‌కు చెందిన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. సమైక్య శంఖారావం ఎవరికీ వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సభ కాదని, రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్ నిరంకుశ వైఖరిని ఎండగట్టడంతోపాటు మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌తో సభ నిర్వహిస్తున్న విషయాన్ని ప్రజలకు చెప్పాలని నేతలకు వివరించారు. ఈ సభ పూర్తి శాంతియుత వాతావరణంలో జరగాలని, ప్రశాంతంగా సభను విజయవంతం చేయడంలో నేతలు తమ వంతు కృషి చేయాలని కోరారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నేతలతో జగన్ సమావేశం జరగ్గా, బుధవారం రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన పార్టీ నాయకులతో జరగనుంది. మరోవైపు ఆయా జిల్లాలకు చెందిన నేతలు శంఖారావం ఏర్పాట్ల వివరాలను పార్టీ నాయకులను కలిసి వివరిస్తున్నారు.