'ప్లకార్డు పట్టుకుని ఆనాడే జగన్ మద్దతు తెలిపారు'
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండానే రాష్ట్ర విభజన చేస్తామనడం అప్రజాస్వామికమని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. రాష్ట్రాన్ని రెండుముక్కులు చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం సభలో ఆయన మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండాలని పార్లమెంట్‌లో ప్లకార్డు పట్టుకుని ఆనాడే జగన్ మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్‌ఆర్‌పై అర్థంలేని వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, టీడీపీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. విభజన నిర్ణయం శిలాశాసనం అయితే సీమాంధ్రలో కాంగ్రెస్‌ను ప్రజలు శిలగా మారుస్తారన్నారు.
విభజన జరిగితే పోలవరం సాధ్యం కాదని, డెల్టా ఎడారి అవుతుందని ఆందోళన వెలిబుచ్చారు. నిరంకుశంగా విభజనను కొనసాగిస్తే రాష్ట్రం భగ్గుమంటుందని హెచ్చరించారు. రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని విభజన ప్రక్రియ ఆపాలన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమైక్య శంఖారావం సభకు తరలివచ్చిన వారందరికీ బోస్ ధన్యవాదాలు తెలిపారు.