‘సమైక్య శంఖారావం’ సభకు.. భారీగా తరలిరండి | Huge Employees to be moved for Ys Jagan's Samaikya Sankharavam | Sakshi
Sakshi News home page

‘సమైక్య శంఖారావం’ సభకు.. భారీగా తరలిరండి

Published Fri, Oct 25 2013 3:27 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

‘సమైక్య శంఖారావం’ సభకు.. భారీగా తరలిరండి - Sakshi

‘సమైక్య శంఖారావం’ సభకు.. భారీగా తరలిరండి

ఉద్యోగులకు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం పిలుపు
‘సమైక్య శంఖారావం’ వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
 

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 26న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ‘సమైక్య శంఖారావం’ సభకు ఉద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం పిలుపునిచ్చింది. సమైక్య శంఖారావానికి సంపూర్ణ మద్దతును ప్రకటించింది. సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నేతృత్వంలో సచివాలయ ఉద్యోగులు గురువారం ‘సమైక్య శంఖారావం’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్ సీపీ ‘సమైక్య శంఖారావం’ చివరి అవకాశమని, కాబట్టి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపే ఉద్యోగులు పెద్ద సంఖ్యలో సభకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు.
 
  సచివాలయంలోని ప్రతి సీమాంధ్ర ఉద్యోగీ పది మంది చొప్పున మొత్తం 5 వేల మందిని సభకు తీసుకురానున్నారని చెప్పారు. 2014 వరకూ రాష్ట్రం విడిపోకుండా కాపాడగలిగితే ఇక ఎప్పటికీ విభజన జరగదని, సమైక్యంగా ఉంటేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందని వివరించారు. వాల్‌పోస్టర్ ఆవిష్కరణలో ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు హరీష్‌కుమార్‌రెడ్డి, అదనపు కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి వరలక్ష్మి, సచివాలయ రాయలసీమ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, సంయుక్త కార్యదర్శి బాలకృష్ణ, ప్రతాపరెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
 
 సచివాలయ సీమాంధ్ర ఫోరం మద్దతు...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ‘సమైక్య శంఖారావం’ బహిరంగ సభకు సచివాలయ సీమాంధ్ర ఫోరం సంపూర్ణ మద్దతు తెలిపింది. సమైక్యం కోసం ఎవరు పోరాడినా వారికి వెన్నంటి నిలుస్తామని ఫోరం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ గురువారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులందరూ సభకు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
 
 ‘సమైక్య’ సభకు ఉద్యోగులు భారీగా తరలిరావాలి
 సాక్షి, హైదరాబాద్: ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఎల్బీ స్టేడియంలో 26న నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి రోడ్లు భవనాల శాఖ ఉద్యోగులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆర్‌అండ్‌బీ సమైక్యాంధ్ర ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. సమైక్యాంధ్రను కోరే వారు భారీగా హాజరై సభను జయప్రదం చేయాలని జేఏసీ చైర్‌పర్సన్ వి.కె.ఎల్.కౌసల్య విజ్ఞప్తి చేశారు.
 
 సమైక్య శంఖారావానికి క్రైస్తవుల మద్దతు
 ఈ నెల 26న వైఎస్సార్ సీపీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని రాష్ట్ర క్రైస్తవ హక్కుల పోరాట సమితి తెలిపింది. ఈ మేరకు సమితి నేత బ్రదర్ ఇమ్మాన్యుయేల్ కిషోర్ కనపర్తి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement