సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ చైర్మన్ గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్రాహ్మణ కార్పొరేషన్‌కు ఎంతో మేలు చేయాలని తనకు ఈ అవకాశం ఇచ్చారని అన్నారు. ఉపనయనం చేసే కార్యక్రమాలు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారానే చేయాలనే ఆలోచన ఉందని, సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుమతితో త్వరలో చేపడతామని అన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ కార్యక్రమాలను సీఎం అమలు చేస్తున్నారని తెలిపారు. పేద బ్రాహ్మణలు, విద్యార్థులకు విజయవాడ, తిరుపతిలలో వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
జోగి రమేష్ మాట్లాడుతూ..నిత్యం ప్రజల కోసం విష్ణు పరితపిస్తుంటారని అన్నారు. ప్రతిష్టాత్మకమైన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఆయనకు వరించినందుకు సంతోషంగా ఉందని అన్నారు. అర్హులైన నిరుపేద బ్రాహ్మణులందరికి సహాయం చేసే అవకాశం దక్కిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు మల్లాది విష్ణుకు వరించాలని ఆకాంక్షించారు.
బ్రాహ్మణులు అభివృద్దికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జ్వాలపురం శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజుల్లో బ్రాహ్మణులకు అవకాశాలు తగ్గుతున్నప్పటికి ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ మాజీ మేయర్ జంధ్యాల శంకర్ కొనియాడారు. ప్రభుత్వానికి, బ్రాహ్మణ పేదలకు వారధిగా పనిచేసే అవకాశం విష్ణుకు దక్కిందని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికి అమలయ్యేలా కృషి చేస్తారని పేర్కొన్నారు. బ్రాహ్మణులకు అవకాశాలు తగ్గిపోతున్న తరుణంలో సీఎం జగన్ అవకాశాలు కల్పిస్తున్నారని అన్నారు. బ్రాహ్మణుల అభివృద్ధి కోసం జగన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మంత్రి బొత్స తెలిపారు.
ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం హాజరు కాగా, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసులు, ఎమ్మెల్యే జోగి రమేష్, టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు అమర్, ప్రముఖ గేయ రచయిత జొన్నవిత్తుల తదితరులు విచ్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment