వైఎస్సార్ విగ్రహం వద్ద ప్ల కార్డులను ప్రదర్శిస్తున్న మంత్రులు, నాయకులు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్నంత కాలం సామాజిక న్యాయ నిర్మాతగా, సామాజిక విప్లవకారుడిగా సీఎం వైఎస్ జగన్ పేరు నిలిచిపోతుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతానికి పైగా ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినందుకు మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున మంగళవారం విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పుష్పాభిషేకం, సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనలు, ఆశయాల్ని సీఎం జగన్ అమలు చేసి చూపించారని తెలిపారు. సామాజిక న్యాయం అంటే ఇలా ఉండాలని రుజువు చేశారన్నారు. పంచాయతీ మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉన్నత శిఖరాలకు ఎక్కిస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయానికి రూపకల్పన చేసి పెత్తందారీ వ్యవస్థను బద్దలు కొట్టారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సీఎం జగన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
దేశంలోనే ఎవరూ చేయలేదు..
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గత ఎన్నికలకు ముందు జరిగిన బీసీ సభలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. తాజాగా 18 ఎమ్మెల్సీ స్థానాల్లో 14 ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో, దేశంలో బడుగు, బలహీనవర్గాలకు ఇంత పెద్ద మొత్తంలో ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు.
గతంలో పనిచేసిన వారు బీసీలకు అంత చేశాం.. ఇంత చేశామంటూ మాటలు మాత్రమే చెప్పారని ఎద్దేవా చేశారు. తాము ఊహించనంతగా సీఎం వైఎస్ జగన్ బీసీలకు 68 శాతానికిపైగా సీట్లు కేటాయించారన్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా రాజ్యాధికారంలో బడుగులకు అత్యున్నత స్థానం కల్పించినందుకు గర్వపడుతున్నామన్నారు. ఏపీ దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుందన్నారు.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో మహనీయులు కన్న కలలు నెరవేరుతున్నాయని చెప్పారు. శాసనమండలిలో 14 స్థానాలు కేటాయించడం నభూతో న భవిష్యత్ అని అన్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.
ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ ఎం.శివరామకృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment