ఆంటోనీ కమిటీకి భట్టి విక్రమార్క కొత్త ప్రతిపాదన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పది జిల్లాలతోపాటు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను కూడా కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న కొత్త ప్రతిపాదన తెరపైకి వస్తోంది. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఏఐసీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీకి ఈ మేరకు ఒక నివేదిక ఇవ్వాలని శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను ఆయన ఇప్పటికే రూపొందించారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి కూడా ఇప్పటికే దీనిపై ఏఐసీసీ పెద్దలతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను తెలంగాణతో కలపాలని, తద్వారా కొత్తగా ఏర్పాటయ్యే తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ఆస్కారం ఉంటుందని డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కతో సహా తెలంగాణలోని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
‘ఉత్తరాంధ్ర జిల్లాలను కలపడం వల్ల అనేక సహజ వనరులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు సముద్రంతో సంధానం లేకుండాపోయింది. ఉత్తరాంధ్ర జిల్లాలను కలిపితే విశాఖ నుంచి సముద్రం, పోర్టులు అందుబాటులో ఉంటాయి. ఇది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది’ అని వారు అభిప్రాయపడుతున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరు నేతలతో భట్టి చర్చించారు. వారి నుంచి సానుకూలత వ్యక్తమవడంతో ఈ దిశగా నివేదికను రూపొందిస్తున్నారు. ఆంటోనీ కమిటీని కలసి తమ ప్రతిపాదన అందించేందుకు భట్టి విక్రమార్క సహా కొందరు నేతలు ఒకట్రెండు రోజుల్లో ఢిల్లీ వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణలో ఉత్తరాంధ్ర కలపాలి: భట్టి విక్రమార్క
Published Wed, Aug 14 2013 2:47 AM | Last Updated on Mon, Oct 8 2018 9:21 PM
Advertisement