మండలంలోని మల్యాడ గ్రామంలో లెంక సత్యం ఇంట్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు.
రూ.80 వేలు, రెండున్నర తులాల బంగారం అపహరణ
నెల్లిమర్ల రూరల్: మండలంలోని మల్యాడ గ్రామంలో లెంక సత్యం ఇంట్లో గురువారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. రూ.80 వేలు నగదు, రెండున్నర తులాల బంగారం తాడు, చెవిదుద్దులు, విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఉక్కపోత కారణంగా కుటుంబ సభ్యులు ఇంటి డాబాపై నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన దొంగలు చాకచాక్యంగా ఇంట్లోకి ప్రవేశించి బీరువాను తెరిచారు. దుస్తులను చిందర వందరగా పడేసి బీరువాలో ఉన్న నగదు, బంగారాన్ని అపహరించుకుపోయాకరు. బీరువాను తెరిచేందుకు ఉపయోగించిన తాళాల గుత్తును అక్కడే వదిలేసి పరారయ్యారు.
ఆభరణాలు విడిపించాలనుకుంటే...
జొన్నలు అమ్మగా వచ్చిన నగదుతో బ్యాంకులో కుదువపెట్టిన బంగారు ఆభరణాలను విడిపించాలని సత్యం భావించాడు. అయితే బ్యాంకులకు రెండు రోజులు వరుస సెలవులు కావడంతో ఆ సొమ్మును ఇంట్లోని బీరువాలో భద్రపరిచాడు. దొంగలు ఆ సొమ్మును దోచుకోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు.
మరో ఇంట్లో చోరికి విఫలయత్నం
అదే గ్రామంలో పప్పల ప్రకాశరావు ఇంట్లో కూడా చోరీ చేయడానికి దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అయితే ఇంట్లో ఏమీ దొరక్కపోవడంతో గుట్టు చప్పుడు కాకుండా అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు అందించిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లిమర్ల ఎస్‌ఐ హెచ్.ఉపేంద్ర తెలిపారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కనిమెల్లలో బంగారం చోరీ
పూసపాటిరేగ : మండలంలోని కనిమెల్లలో గురువారం అర్ధరాత్రి సుమారు లక్షరుపాయల విలువైన బంగారం చోరీకి గురైంది. గ్రామానికి శివారున ఉన్న నడిపేన అప్పలనాయుడు ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో దొంగలు చొరబడ్డారు. చాకచక్యంగా బీరువాను పగలుగొట్టి బంగారు చైన్, హారం, గాజులను పట్టుకుపోయారు. సమాచారం తెలుసుకున్న వెంటనే పూసపాటిరేగ ఎస్‌ఐ కళాధర్ ఆధ్వర్యంలో క్లూస్‌టీం వచ్చి ఇంటిని పరిశీలించారు.