(వెంకటపతి, సాక్షి భీమవరం)
పశ్చిమగోదావరి జిల్లా మెంటేవారి తోటలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్తపై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశాడు. కుటుంబ కలహాల కారణంగా జరిగిన ఈ సంఘటనలో, కత్తి తీసుకుని భార్య, అత్తలపై అతడు దాడి చేశారు. ఈ సంఘటనలో అత్త అక్కడికక్కడే మరణించగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మెంటేవారి తోటకు చెందిన షేక్ సుబానీకి, మీరాబీ అనే మహిళతో గతంలో వివాహమైంది. కొంతకాలం బాగానే ఉన్న తర్వాత అతడు ఈమెను వదిలిపెట్టి వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొన్నాళ్లకు ఆమె ఇతడిని వదిలేయడంతో మళ్లీ భార్య దగ్గరకు వచ్చాడు. కానీ ఇన్నాళ్లూ కాదని ఇప్పుడు ఎందుకు వస్తావంటూ మీరాబీ, ఆమె తల్లి మస్తానమ్మ అతగాడిని రానివ్వలేదు. దీనికితోడు వీళ్ల మధ్య ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి, గొడవపడేవాడు. ఇదే క్రమంలో మంగళవారం తెల్లవారుజామున కూడా వీళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. మాంసం కొట్లో పనిచేసే సుబానీ.. అక్కడ మాంసం కోసే కత్తి తీసుకుని ముందుగా అత్తను నరికేశాడు. అడ్డు వచ్చిన భార్యపై కూడా దాడి చేశాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారి.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.