విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు, మృతుడు మామిడిశెట్టి నర్సింహమూర్తి
సాక్షి, భీమవరం (పశ్చిమ గోదావరి) : భీమవరంలో మాయమై బిక్కవోలులో శవంగా కనిపించిన ఆర్‌ఎంపీ డాక్టర్ మామిడిశెట్టి నర్సింహమూర్తి (36) కేసు మిస్టరీ వీడింది. కుటుంబ విభేదాల నేపథ్యంలో ఆయన్ను బావమరుదులు, బంధువుల సహాయంతో హత్య చేసినట్లు పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
తొలుత మిస్సింగ్ కేసు నమోదు
శ్రీనివాససెంటర్‌లో నివాసం ఉంటున్న మామిడిశెట్టి స్వప్న మంజరి ఈనెల 7న వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్త నర్సింహమూర్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఈనెల 4వ తేదీన దూనబోయిన లక్ష్మీనర్సింహరావు, దూనబోయిన లక్ష్మీనారాయణరావులతో కలిసి బయటకు వెళ్లినట్లు అప్పటి నుంచి తన భర్త సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని తీసుకువెళ్లిన వారిని అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కేసు వివరాలను నరసాపురం డీఎస్పీ కె.నాగేశ్వరరావు భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
జరిగింది ఇదీ..
మామిడిశెట్టి నర్సింహమూర్తి భీమవరం శ్రీనివాస సెంటర్‌లో ఆర్‌ఎంపీ డాక్టర్‌గా శివప్రియ ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ నడుపుతున్నాడు. 15 ఏళ్ల క్రితం రాజరాజేశ్వరి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆమె తన భర్తకు తెలియకుండా అప్పుడప్పుడు బయటకు వెళ్లి తిరిగి వస్తుండేది. ఈ నేపథ్యంలో నర్సింహమూర్తి స్వప్నమంజరి అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆరేళ్ల క్రితం ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు.
తన ముగ్గురు ఆడ పిల్లలు, రెండవ భార్యతో కలిసి ఉంటున్నాడు. మొదటి భార్య అప్పుడప్పుడు వచ్చి పిల్లలను చూసి వెళుతుండేది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాజరాజేశ్వరి కనిపించకపోవడంతో ఆమె సోదరులు దూనబోయిన లక్ష్మీనర్సింహరావు, లక్ష్మీనారాయణలు దాచి వేసి ఉంటారని వారితో పలుమార్లు నర్సింహమూర్తి గొడవపడ్డాడు. తమ సోదరి ఇల్లు విడిచి వెళ్లిపోవడానికి బావ నర్సింహమూర్తి కారణమని లక్ష్మీనర్సింహరావు భావించి కక్ష్య పెంచుకున్నాడు.
ప్లాన్ ప్రకారం హత్య
లక్ష్మీనర్సింహరావు అతని సోదరుడు లక్ష్మీనారాయణ మేనల్లుడు మల్లుల నాగశివ, తోడల్లుడు కట్టా కృష్ణమూర్తి, దూరపు బంధువు కంద్రేకుల మోహన నాగేంధ్రరరావులతో కలిసి నర్సింహమూర్తి హత్యకు ప్లాన్ చేశారు. ఈనెల 4న రాజరాజేశ్వరి పిఠాపురంలో ఉన్నట్లు ఆచూకీ తెలిసిందని బావను నమ్మించి కారులో తీసుకువెళ్లారు. ఆ రోజు రాత్రి 8.30 గంటల సమయంలో బిక్కవోలు–సామర్లకోట కెనాల్ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాటిన తర్వాత కారును ఆపి మధ్యలో కూర్చొన్న నర్సింహమూర్తి మెడచుట్టూ స్కార్ఫ్‌తో గట్టిగా ముడిపెట్టి బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో కట్టి రోడ్డును ఆనుకుని ఉన్న కాలువలో పడేశారు.
11న ఆచూకీ లభ్యం
కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 11న లక్ష్మీనర్సింహరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించడంతో మొత్తం విషయాన్ని అతను అంగీకరించి మృతదేహాన్ని చూపించాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. మిగిలిన నలుగురు నిందితులను గురువారం అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. డీఎస్పీ కె.నాగేశ్వరరావు, కేసు దర్యాప్తు చేసిన సీఐ పి.చంద్రశేఖరరావును సహకరించిన సిబ్బందని అభినందించారు. విలేకరుల సమావేశంలో ఎస్సై డి.హరికృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment