భీమవరంలో మళ్లీ పడగ విప్పిన హత్యా సంస్కృతి
భీమవరం టౌన్: భీమవరం పట్టణంలో కిరాతక హత్యా నేర సంస్కృతి మళ్లీ పడగ విప్పింది. ఏడాదిన్నర క్రితం రౌడీషీటర్ పసుపులేటి రామకృష్ణ దారుణ హత్య తరువాత మళ్లీ ఇప్పుడు మరో రౌడీషీటర్ బైసాని రామకృష్ణ గురువారం అర్థరాత్రి దారుణ హత్యకు గురైన సంఘటనతో భీమవరం ప్రజలు ఉలిక్కిపడ్దారు. మోటారు సైకిల్‌పై బ్యాంకు కాలనిలోని తన నివాసానికి వెళుతున్న రామకృష్ణను 22వ వార్డు పరిధిలోని కటారి వారి వీధిలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి చేసి అతిదారుణంగా హత్య చేసి పరారయ్యారు. తల వెనుక భాగం నుజ్జు నుజ్జుకావడంతో రామకష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలమంతా రక్తంతో బీతావహంగా మారింది. స్థానికులు కొందరు 108కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని వెనుదిరిగినట్లు సమాచారం.
పోలీసులకు సమాచారం అందడంతో వన్‌టౌన్ సిఐ డి.వెంకటేశ్వరరావు, ఎసై ్స కె.సుధాకరరెడ్డి సిబ్బంతితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టు పక్కల విచారణ చేశారు. మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుం సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో అవివాహితుడైన రామకృష్ణకు సోదరిలు ఉన్నారు.
సంఘటనా స్థలంలో ఆయుధాలు:
సంఘటనా స్థలంలో పోలీసులకు మాంసం కొట్టే కత్తులు, ఇనుప రాడ్ , సెల్‌ఫోన్ పోలీసులు గుర్తించారు.
సిసి కెమెరాల్లో హంతకులు జాడ?
రామకృష్ణ హత్య పథకం ప్రకారమే జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి అతను ఇంటికి వెళుతున్న సమయంలో కొందరు మోటార్ సైకిల్‌పై అనుసరించి సమయం చూసి దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు పట్టణంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. మోటార్ సైకిల్‌పై వెళుతున్న రామకృష్ణను వెనుక ఎవరైనా అనుసరించారా, రెండు మూడు కూడళ్లలో అదే వ్యక్తులు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
సెటిల్‌మెంట్లే ప్రాణంతీసాయా!
రామకష్ణ హత్యకు ఆస్తులకు సంబంధించి సెటిల్‌మెంట్‌లలో తలదూర్చడమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా కొన్ని ఆస్తుల సెటిల్‌మెంట్లలో ఇతను పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రౌడీషీట్:
బైసాని రామకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. 2006లో రౌడీషీట్ తెరిచారు. ఒక ప్రధానోపాధ్యాయుడు హత్య కేసులో రామకృష్ణపై రౌడీషీట్ ఉంది. ఇతనిపై హత్యతో పాటు మరికొన్ని కేసులున్నాయి.
హత్యల మిస్టరీ:
ఏడాదిన్నర క్రితం జరిగిన రౌడీ షీటర్ పసుపులేటి రామకృష్ణ హత్య మిస్టరీ ఇప్పటికి వీడలేదు. గతంలో సింహాద్రి అప్పన్న గుడి సమీపంలో రోడ్డులో ఆనంద్ మృతి మిస్టరీ ఇంకా వీడలేదు.
అన్ని కోణాల్లో దర్యాప్తు: డీఎస్పీ
రౌడీషీటర్ బైసాని రామకృష్ణను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని డిఎస్పి పూర్ణచంద్రరావు తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణపై 2006లో రౌడీషీట్ తెరిచామని హత్యతోపాటు మరో ఐదు కేసులు వరకూ ఇతనిపై ఉన్నాయన్నారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. సెక్షన్ 302గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు.