నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. మూడు హత్యలు ఒకేరోజు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మైలార్‌దేవ్‌పల్లిలో పాత కక్షల కారణంగా ఐదుగురు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా నరికి చంపారు. చిక్కడపల్లిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా గొంతు కోసి చంపారు. హత్య చేసి శవాన్ని మాయం చేద్దామని భావించిన ఓవ్యక్తి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన జూబ్లీహిల్స్ కార్మీకనగర్‌లో చోటుచేసుకుంది.
– మైలార్‌దేవ్‌పల్లి/చిక్కడపల్లి/బంజారాహిల్స్
రాజధాని నగరం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన, వెలుగులోకి వచ్చిన మూడు హత్యోందతాలతో రక్తచరిత్రను తలపించింది. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. మైలార్‌దేవ్‌పల్లి వట్టేపల్లిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను ఆటోలో వచ్చిన అయిదుగురు ఆగంతుకులు దారుణంగా హతమార్చారు. మరో ఘటనలో చిక్కడపల్లి సూర్యానగర్ ప్రాంతానికి చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు సద్‌నామ్‌సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్న ఈ దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో ఇంకో దారుణం బయటపడింది. హత్య చేసిన 36 గంటల తర్వాత గురువారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగు చూసింది. కూకట్‌పల్లిలో టైలరింగ్ చేసే మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్‌ను ఓ ఆగంతుకుడు కత్తితో పొడిచి చంపి మృతదేహం పైభాగాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము దాకా ఆ ఇంట్లోనే ఉన్నాడు. నగరంలో ఒకేరోజు మూడు హత్యలు వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల పుటేజీలతో నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు.
మిట్ట మధ్యాహ్నం మర్డర్
మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని వట్టేపల్లి ప్రాంతం.. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలు.. అప్పటి వరకు తమ పనుల్లో నిమగ్నమైన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుల్లెట్ వాహనంపై వస్తున్న రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను ఆటోలో వచి్చన ఐదుగురు ఢీ కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీగలకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ అసద్‌ఖాన్ (48), శాస్త్రిపురం వాసి అంజద్ ఖాన్ సడ్డకులు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుటుంబ కలహాలు వీరిద్దరి మధ్యా వివాదాలకు దారి తీశాయి. వీటి నేపథ్యంలోనే 2018లో శా్రస్తిపురంలోని ఓ స్క్రాప్ దుకాణంలో అంజద్ ఖాన్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ ఖాన్ చాలాకాలం పాటు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు.
ఇతడిపై రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల్లో కొన్ని కేసులు ఉండటంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అసద్, అంజద్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో అసద్ ఖాన్ బుల్లెట్ వాహనంపై వట్టెపల్లి నైస్ హోటల్ సమీపంలోని ఇండియా ఫంక్షన్ హాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో వట్టెపల్లి వైపు నుంచి ఆటోలో ఎదురుగా వచ్చిన దాదాపు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అసద్ వాహనాన్ని ఢీ కొట్టారు. కిందపడిపోయిన అతడు తేరుకునే లోపే ఆటోలోని వ్యక్తులు వేట కత్తులతో కిందికి దిగారు. అదే వేగంతో అసద్‌పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లు సైతం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో కొన్ని నిమిషాల పాటు కత్తులతో నరుకుతూనే ఉన్నారు.
మిగిలిన దుండగులు తమ కత్తులు అక్కడే పడేసి వెళ్లిపోగా... ఓ నిందితుడు మాత్రం కాస్త దూరం వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చాడు. అసద్ బతికి ఉన్నాడనే అనుమానంతో తన వద్ద ఉన్న కత్తితో అతడి తలపై మరో మూడు వేట్లు వేశాడు. ఆ సమయంలోనూ అసద్‌లో కదలికలు ఉన్నాయి. ఐదో వ్యక్తి కూడా తన కత్తిని అక్కడే పడేసి పరారయ్యాడు. కొద్దిసేపు కొన ఊపిరితో ఉన్న అసద్ ఆపై ఘటనాస్థలిలోనే కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంజద్ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగిందా? కుటుంబ కలహాలా? ఇతర కారణాలా? అనేవి ఆరా తీస్తున్నారు.
గొంతు కోసి చంపాడు..
చిక్కడపల్లి సూర్యానగర్ ప్రాంతంలో నివసించే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్న ఈ ఉదంతం గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. హతుడి రూమ్‌లో ఉండే మరో వ్యక్తి ఆచూకీ లేక పోవడంతో అతడి ప్రమేయంపై పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన సద్‌నామ్‌సింగ్ (30) కొన్నాళ్ల క్రితం తన భార్య బల్జీత్ కౌర్‌తో కలిసి నగరానికి వలసవచ్చాడు. ఏడేళ్ల కుమారుడితో కలిసి వీళ్లు చిక్కడపల్లి సూర్యానగర్‌లో ఓ ఇంట్లో ఏడాదిన్నరగా అద్దెకు ఉంటున్నారు. సద్‌నామ్‌సింగ్ నారాయణగూడలోని జాహ్నవి కశాశాల వద్ద ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. బల్జీత్ కౌర్ తన కుమారుడితో కలిసి గత నెల 10 నుంచి అఫ్జల్‌గంజ్ గురుద్వార్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఆఖరుసారిగా తన భర్తతో ఫోన్‌లో మాట్లాడింది. గురువారం తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు.
సాయంత్రం తన స్నేహితులతో కలిసి సూర్యానగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా... రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న భర్త కనిపించాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచి్చంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం స్థితిగతుల్ని బట్టి బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో సహాయకుడిగా పని చేసేందుకు వీరి సమీప బంధువు నిషాంత్ సింగ్ 20 రోజుల క్రితం నగరానికి వచ్చి సద్‌నామ్‌సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. రాత్రి నుంచి అతడి ఆచూకీ లేకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతడి ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తూ ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సమీప బంధువైన నిషాంత్ సింగ్ వీరింటికి వచి్చన కొన్ని రోజులకే బల్జీత్‌కౌర్ తన కుమారుడితో గురుద్వారాకు వెళ్లిపోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
హత్య చేసి ఫ్రిజ్‌లో
హత్య చేసి శవాన్ని మాయం చేద్దామని భావించాడు.. తన ఒక్కడితో సాధ్యం కాకపోవడంతో విరమించుకున్నాడు.. మృతదేహాన్ని వంటింటిలోని ఫ్రిజ్‌లో పెట్టడానికి యత్నించాడు. అది కుదరకపోవడంతో పై భాగం వరకు రిఫ్రిజిరేటర్‌లో పెట్టి పరారయ్యాడు. జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో చోటు చేసుకున్న ఈ హత్య 36 గంటల తర్వాత గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో టైలరింగ్ చేసే మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్ (38) కారి్మకనగర్‌లోని విద్యాసాగర్ పాఠశాల సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్తులో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి మూడేళ్లుగా అద్దెకుంటున్నాడు. మంగళవారం ఉదయం భార్య రుబీనా పిల్లల్ని తీసుకుని శ్రీరాంనగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి అహ్మద్ సైతం అక్కడికే వెళ్లి భోజనం చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. గురువారం సాయంత్రం తాళం వేసి ఉన్న సిద్దిఖ్ అహ్మద్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో యజమానికి అనుమానం వచ్చింది.
ఆయనతో పాటు సమీపంలో నివసించే వారు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తాళం పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వంటింట్లోని ఫ్రిజ్‌లో తలభాగం, మిగిలిన సగభాగం నేలపై ఉన్న సిద్దిఖ్ అహ్మద్ మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించిన అధికారులు హత్యపై ఓ నిర్ధారణకు వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సిద్దిఖ్ అహ్మద్ అత్త వారింటి నుంచి తన ఇంటికి వచ్చే సమయానికే ఓ అగంతకుడు అక్కడ వేచి ఉన్నాడు. సిద్ధిఖీ వెనుకే ఇంట్లోకి వెళ్లిన అతగాడు కత్తితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై రక్తం కారు తుండటంతో సిద్దిఖ్ ధరించిన బనీను తీసి అతడి తలకు కట్టాడు. అనంతరం గదిలో పడిన రక్తం మరకలు శుభ్రం చేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు తలుపునకు ఉన్న కర్టెన్ తీసి అందులో చుట్టాడు. బయటకు తరలించేందుకు ప్రయతి్నంచినా సాధ్యం కాకపోవడంతో శవాన్ని రిఫ్రిజిరేటర్ వరకు లాక్కెళ్లాడు.
దాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెడితే కుళ్లిపోదనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు. ఇదీ విఫలం కావడంతో ఫ్రిజ్‌ను ఖాళీ చేసి తలవైపు భాగాన్ని లోపలకు పెట్టాడు. మిగిలిన శరీర భాగం బయటే వదిలేసి ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచేశాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4.45 గంటల వరకు నిందితుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆపై బయటకు వచ్చిన అతగాడు ఇంటికి తాళం వేసి పరారైనట్లు రికార్డు అయింది. దాదాపు 36 గంటల అనంతరం గురువారం సాయంత్రం ఈ హత్య వెలుగులోకి వచ్చిం. సిద్దిఖ్ అహ్మద్‌కు నలుగురు అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయాన్ని హతుడి భార్య పోలీసులకు వివరించింది. జహీరాబాద్ సమీపంలోని స్థలానికి సంబంధించి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని వెల్లడించింది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి దాదాపు 30 ఏళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిద్దిఖ్ కదలికలపై స్పష్టమైన సమాచారం ఉన్న వ్యక్తే హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఫ్రిజ్ ముందు పడిఉన్న సిద్దిఖ్ అహ్మద్ మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment