roudy sheeter
-
రాజధానిలో వరుస హత్యల కలకలం
నగరం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. మూడు హత్యలు ఒకేరోజు వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మైలార్‌దేవ్‌పల్లిలో పాత కక్షల కారణంగా ఐదుగురు నడిరోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా నరికి చంపారు. చిక్కడపల్లిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా గొంతు కోసి చంపారు. హత్య చేసి శవాన్ని మాయం చేద్దామని భావించిన ఓవ్యక్తి మృతదేహాన్ని ఫ్రిజ్‌లో పెట్టిన ఘటన జూబ్లీహిల్స్ కార్మీకనగర్లో చోటుచేసుకుంది. – మైలార్‌దేవ్‌పల్లి/చిక్కడపల్లి/బంజారాహిల్స్ రాజధాని నగరం ఒక్కసారిగా కలవరపాటుకు గురైంది. గురువారం వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన, వెలుగులోకి వచ్చిన మూడు హత్యోందతాలతో రక్తచరిత్రను తలపించింది. స్థానికుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. మైలార్‌దేవ్‌పల్లి వట్టేపల్లిలో ద్విచక్ర వాహనంపై వస్తున్న రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను ఆటోలో వచ్చిన అయిదుగురు ఆగంతుకులు దారుణంగా హతమార్చారు. మరో ఘటనలో చిక్కడపల్లి సూర్యానగర్ ప్రాంతానికి చెందిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు సద్‌నామ్‌సింగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్న ఈ దారుణం గురువారం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో ఇంకో దారుణం బయటపడింది. హత్య చేసిన 36 గంటల తర్వాత గురువారం సాయంత్రం ఈ ఉదంతం వెలుగు చూసింది. కూకట్‌పల్లిలో టైలరింగ్ చేసే మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్‌ను ఓ ఆగంతుకుడు కత్తితో పొడిచి చంపి మృతదేహం పైభాగాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము దాకా ఆ ఇంట్లోనే ఉన్నాడు. నగరంలో ఒకేరోజు మూడు హత్యలు వెలుగుచూడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ కెమెరాల పుటేజీలతో నిందితులను పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మిట్ట మధ్యాహ్నం మర్డర్ మైలార్‌దేవ్‌పల్లి ఠాణా పరిధిలోని వట్టేపల్లి ప్రాంతం.. గురువారం మధ్యాహ్నం 1.30 గంటలు.. అప్పటి వరకు తమ పనుల్లో నిమగ్నమైన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బుల్లెట్ వాహనంపై వస్తున్న రౌడీషీటర్ అసద్ ఖాన్‌ను ఆటోలో వచి్చన ఐదుగురు ఢీ కొట్టి దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం సృష్టించింది. కుటుంబ కలహాలు, పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీగలకుంట ప్రాంతానికి చెందిన మహ్మద్ అసద్‌ఖాన్ (48), శాస్త్రిపురం వాసి అంజద్ ఖాన్ సడ్డకులు. ఆస్తి పంపకాల నేపథ్యంలో కుటుంబ కలహాలు వీరిద్దరి మధ్యా వివాదాలకు దారి తీశాయి. వీటి నేపథ్యంలోనే 2018లో శా్రస్తిపురంలోని ఓ స్క్రాప్ దుకాణంలో అంజద్ ఖాన్ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అసద్ ఖాన్ చాలాకాలం పాటు జైల్లో ఉండి ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఇతడిపై రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల్లో కొన్ని కేసులు ఉండటంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు రౌడీషీట్ తెరిచారు. అసద్, అంజద్ కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం 1.20 గంటల ప్రాంతంలో అసద్ ఖాన్ బుల్లెట్ వాహనంపై వట్టెపల్లి నైస్ హోటల్ సమీపంలోని ఇండియా ఫంక్షన్ హాల్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో వట్టెపల్లి వైపు నుంచి ఆటోలో ఎదురుగా వచ్చిన దాదాపు ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు అసద్ వాహనాన్ని ఢీ కొట్టారు. కిందపడిపోయిన అతడు తేరుకునే లోపే ఆటోలోని వ్యక్తులు వేట కత్తులతో కిందికి దిగారు. అదే వేగంతో అసద్‌పై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్లు సైతం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో కొన్ని నిమిషాల పాటు కత్తులతో నరుకుతూనే ఉన్నారు. మిగిలిన దుండగులు తమ కత్తులు అక్కడే పడేసి వెళ్లిపోగా... ఓ నిందితుడు మాత్రం కాస్త దూరం వెళ్లి మళ్లీ వెనక్కు వచ్చాడు. అసద్ బతికి ఉన్నాడనే అనుమానంతో తన వద్ద ఉన్న కత్తితో అతడి తలపై మరో మూడు వేట్లు వేశాడు. ఆ సమయంలోనూ అసద్‌లో కదలికలు ఉన్నాయి. ఐదో వ్యక్తి కూడా తన కత్తిని అక్కడే పడేసి పరారయ్యాడు. కొద్దిసేపు కొన ఊపిరితో ఉన్న అసద్ ఆపై ఘటనాస్థలిలోనే కన్నుమూశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంజద్ హత్యకు ప్రతీకారంగా ఈ హత్య జరిగిందా? కుటుంబ కలహాలా? ఇతర కారణాలా? అనేవి ఆరా తీస్తున్నారు. గొంతు కోసి చంపాడు.. చిక్కడపల్లి సూర్యానగర్ ప్రాంతంలో నివసించే ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బుధవారం రాత్రి జరిగినట్లు అనుమానిస్తున్న ఈ ఉదంతం గురువారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. హతుడి రూమ్‌లో ఉండే మరో వ్యక్తి ఆచూకీ లేక పోవడంతో అతడి ప్రమేయంపై పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌కు చెందిన సద్నామ్సింగ్ (30) కొన్నాళ్ల క్రితం తన భార్య బల్జీత్ కౌర్‌తో కలిసి నగరానికి వలసవచ్చాడు. ఏడేళ్ల కుమారుడితో కలిసి వీళ్లు చిక్కడపల్లి సూర్యానగర్‌లో ఓ ఇంట్లో ఏడాదిన్నరగా అద్దెకు ఉంటున్నారు. సద్నామ్సింగ్ నారాయణగూడలోని జాహ్నవి కశాశాల వద్ద ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. బల్జీత్ కౌర్ తన కుమారుడితో కలిసి గత నెల 10 నుంచి అఫ్జల్‌గంజ్ గురుద్వార్‌లో పనిచేస్తూ అక్కడే ఉంటోంది. బుధవారం రాత్రి 7.30 గంటలకు ఆఖరుసారిగా తన భర్తతో ఫోన్లో మాట్లాడింది. గురువారం తన భర్తకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేదు. సాయంత్రం తన స్నేహితులతో కలిసి సూర్యానగర్‌లోని ఇంటికి వచ్చి చూడగా... రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్న భర్త కనిపించాడు. దీంతో ఆమె పోలీసులకు సమాచారం ఇచి్చంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం స్థితిగతుల్ని బట్టి బుధవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సహాయకుడిగా పని చేసేందుకు వీరి సమీప బంధువు నిషాంత్ సింగ్ 20 రోజుల క్రితం నగరానికి వచ్చి సద్‌నామ్‌సింగ్‌తో కలిసి ఉంటున్నాడు. రాత్రి నుంచి అతడి ఆచూకీ లేకపోవడం, సెల్‌ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతడి ప్రమేయాన్ని పోలీసులు అనుమానిస్తూ ముమ్మరంగా గాలిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సమీప బంధువైన నిషాంత్ సింగ్ వీరింటికి వచి్చన కొన్ని రోజులకే బల్జీత్‌కౌర్ తన కుమారుడితో గురుద్వారాకు వెళ్లిపోవడానికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. హత్య చేసి ఫ్రిజ్‌లో హత్య చేసి శవాన్ని మాయం చేద్దామని భావించాడు.. తన ఒక్కడితో సాధ్యం కాకపోవడంతో విరమించుకున్నాడు.. మృతదేహాన్ని వంటింటిలోని ఫ్రిజ్‌లో పెట్టడానికి యత్నించాడు. అది కుదరకపోవడంతో పై భాగం వరకు రిఫ్రిజిరేటర్లో పెట్టి పరారయ్యాడు. జూబ్లీహిల్స్ కార్మికనగర్‌లో చోటు చేసుకున్న ఈ హత్య 36 గంటల తర్వాత గురువారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లిలో టైలరింగ్ చేసే మహ్మద్ సిద్దిఖ్ అహ్మద్ (38) కారి్మకనగర్లోని విద్యాసాగర్ పాఠశాల సమీపంలోని ఓ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి మూడేళ్లుగా అద్దెకుంటున్నాడు. మంగళవారం ఉదయం భార్య రుబీనా పిల్లల్ని తీసుకుని శ్రీరాంనగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఆ రోజు రాత్రి అహ్మద్ సైతం అక్కడికే వెళ్లి భోజనం చేసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. గురువారం సాయంత్రం తాళం వేసి ఉన్న సిద్దిఖ్ అహ్మద్ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో యజమానికి అనుమానం వచ్చింది. ఆయనతో పాటు సమీపంలో నివసించే వారు జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో పాటు క్లూస్ టీం, ఫింగర్ ప్రింట్స్ టీం, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. తాళం పగులకొట్టి లోపలకు వెళ్లి చూడగా వంటింట్లోని ఫ్రిజ్‌లో తలభాగం, మిగిలిన సగభాగం నేలపై ఉన్న సిద్దిఖ్ అహ్మద్ మృతదేహం కనిపించింది. సీసీ ఫుటేజ్‌లు పరిశీలించిన అధికారులు హత్యపై ఓ నిర్ధారణకు వచ్చారు. మంగళవారం అర్ధరాత్రి సిద్దిఖ్ అహ్మద్ అత్త వారింటి నుంచి తన ఇంటికి వచ్చే సమయానికే ఓ అగంతకుడు అక్కడ వేచి ఉన్నాడు. సిద్ధిఖీ వెనుకే ఇంట్లోకి వెళ్లిన అతగాడు కత్తితో దాడి చేశాడు. తలకు తీవ్రగాయమై రక్తం కారు తుండటంతో సిద్దిఖ్ ధరించిన బనీను తీసి అతడి తలకు కట్టాడు. అనంతరం గదిలో పడిన రక్తం మరకలు శుభ్రం చేశాడు. మృతదేహాన్ని మాయం చేసేందుకు తలుపునకు ఉన్న కర్టెన్ తీసి అందులో చుట్టాడు. బయటకు తరలించేందుకు ప్రయతి్నంచినా సాధ్యం కాకపోవడంతో శవాన్ని రిఫ్రిజిరేటర్ వరకు లాక్కెళ్లాడు. దాన్ని రిఫ్రిజిరేటర్లో పెడితే కుళ్లిపోదనే ఉద్దేశంతో ఆ ప్రయత్నం చేశాడు. ఇదీ విఫలం కావడంతో ఫ్రిజ్‌ను ఖాళీ చేసి తలవైపు భాగాన్ని లోపలకు పెట్టాడు. మిగిలిన శరీర భాగం బయటే వదిలేసి ఫ్రిజ్ డోర్ తెరిచి ఉంచేశాడు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4.45 గంటల వరకు నిందితుడు ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆపై బయటకు వచ్చిన అతగాడు ఇంటికి తాళం వేసి పరారైనట్లు రికార్డు అయింది. దాదాపు 36 గంటల అనంతరం గురువారం సాయంత్రం ఈ హత్య వెలుగులోకి వచ్చిం. సిద్దిఖ్ అహ్మద్‌కు నలుగురు అన్నదమ్ములు. వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్న విషయాన్ని హతుడి భార్య పోలీసులకు వివరించింది. జహీరాబాద్ సమీపంలోని స్థలానికి సంబంధించి గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని వెల్లడించింది. అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి దాదాపు 30 ఏళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు. సిద్దిఖ్ కదలికలపై స్పష్టమైన సమాచారం ఉన్న వ్యక్తే హత్యకు పాల్పడ్డట్లు పోలీసులు భావిస్తున్నారు. ఫ్రిజ్ ముందు పడిఉన్న సిద్దిఖ్ అహ్మద్ మృతదేహం చదవండి: మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో దారుణం.. -
హహహ.. ఆనందంగా సచ్చిపోతా!
సాక్షి, ప్రకాశం: ఒంగోలు తాలుకా పోలీస్ స్టేషన్లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా అతన్ని స్టేషన్‌కు తరలించగా పోలీసులకు చుక్కలు చూపించాడు. స్టేషన్లో అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు నిప్పంటించాడు. చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి. అయినప్పటికీ నిందితుడు సురేష్ వింతగా నవ్వుతూ వాహనం నుంచి దిగడానికి మొండికేశాడు. ‘నే సచ్చిపోతా.. ఆనందంగా సచ్చిపోతా’ అంటూ పిచ్చిగా ప్రవర్తించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని బలవంతంగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది. అయితే, వారి కళ్లుగప్పి సురేష్ పరారయ్యాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేక స్టేషన్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతన్ని కోవిడ్ అనుమాతుడిగా భావిస్తున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా, మంటల ధాటికి అంబులెన్స్ పూర్తిగా కాలి బూడిదైంది. (చదవండి: శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు) -
ప్రాణహాని ఉందంటూ హిజ్రాల ఆందోళన
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాలు శనివారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. వెంకట్ అనే రౌడీ షీటర్ వేధింపుల నుంచి తమను కాపాడాలని పోలీసులను వేడుకొన్నారు. తమ నివాసాలపై మారణాయుధాలతో దాడి చేసి తరచూ డబ్బులు తీసుకెళ్తున్నాడని ఆవేదనవ్యక్తం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడంలేదని వాపోయారు. గత్యంతరం లేకనే ధర్నా చేస్తున్నామని తెలిపారు. వెంకట్ నుంచి తమకు ప్రాణహాని ఉందనీ, అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రౌడిషీటర్పై చర్యలు తీసుకునేవరకు ఆందోళన విరమించమని తేల్చిచెప్పారు. నిందితునిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు నచ్చజెప్పడంతో హిజ్రాలు ఆందోళన విరమించారు. -
మద్యం మత్తులో స్నేహితుల అఘాయిత్యం
సాక్షి, కర్ణాటక: ఓ వ్యక్తిని మద్యం మత్తులో స్నేహితులే దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన దొడ్డబళ్లాపురం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ శివారులోని దేవనహళ్లి రోడ్డులో రఘునాథపురం వద్ద ఉన్న ఇన్ఫోసిటీలో నివసిస్తున్న రవికుమార్ కుమారుడు కిరణ్ ఆలియాస్ గోటు(27) అనే రౌడీ హత్యకు గురయ్యాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. తన స్నేహితులే కిరణ్ తలపై బండరాయితో మోది హత్యను చేసినట్లు సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. కిరణ్ స్నేహితుడు అరుణ్ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కిరణ్ ఇంటికి వచ్చి అతన్ని బయటికి తీసుకువెళ్లాడు. గంట తరువాత అరుణ్ మళ్లీ కిరణ్ ఇంటికి వచ్చి కాటు, చిన్ను అనే యువకులతో కిరణ్ గొడవపడుతున్నాడని మీరు వెళ్లి విడిపించడని చెప్పాడు. అయితే కిరణ్ తండ్రి ఘటనాస్థలానికి వచ్చేసరికి కిరణ్ హత్యకు గురయ్యాడు. అప్పటికే అఘాయిత్యానికి పాల్పడ్డ వారు పరారయ్యారు. ఘటనాస్థలంలో మద్యం బాటిళ్లు, తినుబండారాలు ఉండటంతో యువకులు కలిసి పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. మద్యం మత్తులో పాత గొడవలకు సంబంధించి మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కిరణ్‌పై 2010లో పోలీసులు కిడ్నాప్, అకారణంగా అమాయకులపై గొడవపడి ఘర్షణపడడం, కళాశాల విద్యార్థినీ విద్యార్థులను బెదిరించి డబ్బులు, మొబైళ్లు లాక్కోవడం లాంటి ఆరోపనలపై రౌడీషీట్ తెరిచారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అరుణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు ననమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భీమవరంలో మళ్లీ పడగ విప్పిన హత్యా సంస్కృతి
భీమవరం టౌన్: భీమవరం పట్టణంలో కిరాతక హత్యా నేర సంస్కృతి మళ్లీ పడగ విప్పింది. ఏడాదిన్నర క్రితం రౌడీషీటర్ పసుపులేటి రామకృష్ణ దారుణ హత్య తరువాత మళ్లీ ఇప్పుడు మరో రౌడీషీటర్ బైసాని రామకృష్ణ గురువారం అర్థరాత్రి దారుణ హత్యకు గురైన సంఘటనతో భీమవరం ప్రజలు ఉలిక్కిపడ్దారు. మోటారు సైకిల్‌పై బ్యాంకు కాలనిలోని తన నివాసానికి వెళుతున్న రామకృష్ణను 22వ వార్డు పరిధిలోని కటారి వారి వీధిలో రాత్రి సుమారు 11 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి చేసి అతిదారుణంగా హత్య చేసి పరారయ్యారు. తల వెనుక భాగం నుజ్జు నుజ్జుకావడంతో రామకష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలమంతా రక్తంతో బీతావహంగా మారింది. స్థానికులు కొందరు 108కు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకుని వెనుదిరిగినట్లు సమాచారం. పోలీసులకు సమాచారం అందడంతో వన్‌టౌన్ సిఐ డి.వెంకటేశ్వరరావు, ఎసై ్స కె.సుధాకరరెడ్డి సిబ్బంతితో సంఘటనా స్థలాన్ని పరిశీలించి చుట్టు పక్కల విచారణ చేశారు. మృత దేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మృతుడి కుటుం సభ్యులు ప్రభుత్వాసుపత్రికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో అవివాహితుడైన రామకృష్ణకు సోదరిలు ఉన్నారు. సంఘటనా స్థలంలో ఆయుధాలు: సంఘటనా స్థలంలో పోలీసులకు మాంసం కొట్టే కత్తులు, ఇనుప రాడ్ , సెల్‌ఫోన్ పోలీసులు గుర్తించారు. సిసి కెమెరాల్లో హంతకులు జాడ? రామకృష్ణ హత్య పథకం ప్రకారమే జరిగి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి అతను ఇంటికి వెళుతున్న సమయంలో కొందరు మోటార్ సైకిల్‌పై అనుసరించి సమయం చూసి దాడి చేసినట్లుగా భావిస్తున్నారు. పోలీసులు పట్టణంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను పరిశీలిస్తున్నారు. మోటార్ సైకిల్‌పై వెళుతున్న రామకృష్ణను వెనుక ఎవరైనా అనుసరించారా, రెండు మూడు కూడళ్లలో అదే వ్యక్తులు సీసీ కెమెరాల్లో కనిపిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సెటిల్మెంట్లే ప్రాణంతీసాయా! రామకష్ణ హత్యకు ఆస్తులకు సంబంధించి సెటిల్మెంట్లలో తలదూర్చడమే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంత కాలంగా కొన్ని ఆస్తుల సెటిల్మెంట్లలో ఇతను పాల్గొన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రౌడీషీట్: బైసాని రామకృష్ణపై పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ ఉంది. 2006లో రౌడీషీట్ తెరిచారు. ఒక ప్రధానోపాధ్యాయుడు హత్య కేసులో రామకృష్ణపై రౌడీషీట్ ఉంది. ఇతనిపై హత్యతో పాటు మరికొన్ని కేసులున్నాయి. హత్యల మిస్టరీ: ఏడాదిన్నర క్రితం జరిగిన రౌడీ షీటర్ పసుపులేటి రామకృష్ణ హత్య మిస్టరీ ఇప్పటికి వీడలేదు. గతంలో సింహాద్రి అప్పన్న గుడి సమీపంలో రోడ్డులో ఆనంద్ మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు: డీఎస్పీ రౌడీషీటర్ బైసాని రామకృష్ణను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని డిఎస్పి పూర్ణచంద్రరావు తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రామకృష్ణపై 2006లో రౌడీషీట్ తెరిచామని హత్యతోపాటు మరో ఐదు కేసులు వరకూ ఇతనిపై ఉన్నాయన్నారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నామన్నారు. సెక్షన్ 302గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ఉన్నారు. -
భీమవరంలో రౌడీషీటర్ దారుణ హత్య
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లో సుంకర బద్దయ్యగారి వీధిలో బైసాని రామకృష్ణ అనే రౌడీషీటర్ గురువారం అర్ధరాత్రి సమయంలో దారుణ హత్యకు గురయ్యారు. ప్రత్యర్థులు మాంసం కొట్టే కత్తితో రామకృష్ణను నరికి చంపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
విశాఖలో రౌడీషీటర్ దారుణహత్య
అల్లీపురం: విశాఖపట్నం జిల్లాపరిషత్ కార్యాలయం సమీపంలో నర్సింహమూర్తి(43) అనే రౌడీషీటర్ దారుణహత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది చంపారు. ఈ సంఘటన సపోమవారం రాత్రి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న విశాఖ జోన్1 డీసీపీ త్రివిక్రమ వర్మ విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
రౌడీ షీటర్ దారుణ హత్య
నల్లగొండ: నల్లగొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్ యూసుఫ్ దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం ఉదయం కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు యూసఫ్‌ను గొడ్డళ్లతో నరికి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్, నల్లగొండ,రంగారెడ్డి జిల్లాల పరిధిలో భూ తగాదాలతో పాటు, 12 హత్యలు సహా దాదాపు 100 కేసుల్లో ఇతడు నిందితుడు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.