'పతి' వంచితురాలు.! | Man Cheated Wife in YSR Kadapa | Sakshi
Sakshi News home page

'పతి' వంచితురాలు.!

Published Tue, Feb 12 2019 1:39 PM | Last Updated on Tue, Feb 12 2019 1:39 PM

Man Cheated Wife in YSR Kadapa - Sakshi

దిగాలుగా ఉన్న గౌసియా , మానవహక్కుల వేదిక కన్వీనర్‌ జయశ్రీ

పదేళ్లుగా నరకంకడప నగరం నకాష్‌లోని మారెమ్మ గుడి పక్కన నివాసమున్న బంగారు వ్యాపారి గౌస్‌పీర్‌ 1991లో ముద్దనూరుకు చెందిన గౌసియాను వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలగలేదనే కారణాన్ని చూపి తనకు పరిచయమైన మరో మహిళను గౌస్‌పీర్‌ వివాహం చేసుకుని వేరే కాపురం పెట్టాడు.  కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా అడవిలో వదిలేసినట్లు శిథిలమైన ఇంటిలో వదిలేసి... కుక్కలకు విసిరేసినట్లు ఏదో ఒకటి తెచ్చి అలా వేసి పోతుండడం చూస్తే చనిపోవాలనిపిస్తోందని గౌసియా బోరున విలపిస్తోంది.

సాక్షి కడప/అర్బన్‌ : ఎన్నో ఆశలతో... మరెన్నో ఆకాంక్షలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆడపడుచుకు అడుగడుగునా అన్యాయమే  జరిగింది. పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని, జీవితాంతం తోడు నీడగా ఉండాల్సిన భర్త  పిల్లలు పుట్టలేదనే సాకు చూపి దూరం పెట్టాడు. మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అంతవరకు ఏదో  అనుకున్నా.. తొలి భార్యకు మాత్రం నరకం చూపించాడు. పట్టుమని పది నిమిషాలు కూడా ఉండలేని ఓ పాడుబడిన ఇంటిలో ఒంటరిగా వదిలేశాడు. ఇళ్లంతా పెచ్చులూడిపోయి మట్టి వాసన ఒకవైపు.. అక్కడే కాలకృత్యాలతో వస్తున్న దుర్వాసన ఇంకోవైపు.. తాగడానికి మంచినీరు పోసుకునే క్యాన్‌ సైతం  పాచిపట్టి.. కుప్పలు కుప్పలుగా అక్కడే పడి ఉన్న పాత దుస్తుల దుర్గంధం మధ్యకాలం వెళ్లదీస్తున్న ఆ మహిళను చూస్తే ఎవరికైనా అయ్యో.. పాపం అనిపిస్తుంది. కానీ కట్టుకున్న భర్తకు మాత్రం కనికరం కలగలేదు. ఏదో పొద్దున, సాయంత్రం ఒకటో, రెండో ఇడ్లి, కొంచెం అన్నం బయటి నుంచి తెచ్చి ఆమె ముఖాన పడేస్తే సరిపోతుందనుకున్నాడో లేక దిక్కులేకుండా వదిలేస్తే మనో వేదనతో ఆమే తనువు చాలిస్తుందనుకున్నాడో తెలియదుగానీ ఆమె పడుతున్న వేదన మాత్రం అంతా ఇంతా కాదు. పైగా భర్తపై  పెంచుకున్న మమకారం కాస్త ప్రస్తుతం మనోవేదనకు దారి తీయడంతో ఆమె కుంగిపోయింది. అందరూ ఉన్నా చెత్తకుప్పను తలపించేలా ఉన్న ఇంటిలో జీవచ్ఛవంలా బతుకు వెళ్లదీస్తోంది. ఆమెను కదిలిస్తే ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ చెబుతున్న మాటలు విన్నవారంతా అయ్యో..ఎంత అమానుషం.. అంటూ చలించిపోయారు.

పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినగౌసియా సోదరులు
గౌసియా నివాసం వద్దకు వచ్చిన భర్త గౌస్‌పీర్‌ను స్థానికులతోపాటు బాధితురాలి బంధువులు టుటౌన్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీతోపాటు గౌసియా బంధువులు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు.విషయాన్ని డీఎస్పీ మాసుంబాషా దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఎస్‌ఐ రుషేంద్రబాబును సాక్షి వివరణ కోరగా బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, పోలీసు స్టేషన్‌లో న్యాయం జరగకపోతే జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని బాధితురాలి బంధువులు తెలిపారు.

ఇంటిలో నరకం
ప్రస్తుతం ఉంటున్న ఇంటిలో గౌసియా నరకం అనుభవిస్తోంది. పాడుబడిన ఆ ఇంటిలోనే  అన్నం తినడం, మల విసర్జన, పడుకోవడం అన్నీ అక్కడి పరిసరాల్లోనే. ఇంటి గోడలకు రంధ్రాలు పడి, పెచ్చులూడిపోయి లోపల ఎర్రటి మట్టి కనిపిస్తూ ఎలుకలు సైతం అక్కడే నివాసం చేస్తున్నాయి. ఇంటిని శుభ్రపరిచేవారు లేరు.  

కుటుంబ సభ్యులనునిలదీసిన జయశ్రీ
గౌసియా పడుతున్న వేదన తెలుసుకుని అక్కడికి వచ్చిన మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ బాధితురాలు ఉంటున్న ఇంటికి పక్కనే ఖరీదైన భవంతిలో నివాసముంటున్న గౌస్‌పీర్‌ తల్లిని, అతని సోదరిని నిలదీశారు. పక్కింటిలోనే∙కోడలు అనాథలా బతుకుతుంటే మీకు పట్టదా? అంటూ ప్రశ్నించారు. దీంతో వాళ్లు తమకు ఏం సంబంధం లేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. అంతకుమునుపు జయశ్రీ ఇంటిలోకి వెళ్లి గౌసియాను పరామర్శించి ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గౌసియాను నరకయాతనకు గురి చేస్తున్న భర్తపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్‌ చేశారు. జైలులో ఉన్న కరుడుగట్టిన ఖైదీలకు కూడా సౌకర్యాలు కల్పిస్తారని, కానీ గౌసియా అత్యంత  దుర్భర పరిస్థితిలో జీవనం గడుపుతుండడం చూస్తే బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త, ఆడబిడ్డ పక్కనే ఉన్నా గౌసియాను అమానుష పరిస్థితుల్లో వదిలివేయడం దారుణమని. ఆమెను చంపకుండా చచ్చిపోయేలా చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement