సాక్షి, పాడేరు(విశాఖపట్టణం) : విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా మత్స్యగెడ్డలో గల్లంతైన గిరిజనుడి ఆచూకీ కొన్ని రోజుల తర్వాత అతని పెంపుడు కుక్క కారణంగా లభ్యమైంది. పాడేరు మండలం పాతరపుట్టుకి చెందిన లక్ష్మయ్య 20 రోజుల క్రితం వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న సమయంలో మత్స్యగెడ్డ ప్రవాహానికి కొట్టుకుపోయాడు. కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఎంత గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు.
కాగా అతడి పెంపుడు కుక్క మాత్రం పట్టు వదలకుండా గాలిస్తూనే ఉంది. చివరికి వరద ఉధృతి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నం ఇసుక దిబ్బల్లో కూరుకుపోయిన లక్ష్మయ్య మృతదేహం జాడ కనుక్కుంది. కాళ్లతో అతడి చొక్కాను బయటకు లాగే ప్రయత్నం చేసింది. వెంటనే దుర్వాసన రావడంతో కుటుంబ సభ్యులు వచ్చి మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్‌ఐ వెంకటరమణ, వీఆర్‌ఏ సింహాచలానికి చేరవేశారు. పెంపుడు కుక్క పుణ్యమా అని ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. అయితే వ్యక్తి చనిపోయాడన్న వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment