అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. జామి మండలం బలరాంపురం గ్రామంలో వర్షాలకు ఓ భారీ వృక్షం కూలిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.
అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు విషాదాన్ని మిగిల్చాయి. జామి మండలం బలరాంపురం గ్రామంలో వర్షాలకు ఓ భారీ వృక్షం కూలిపోవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. విజయనగరం నుంచి శృంగవరపు కోట, అనకాపల్లి ప్రాంతాలకు రాకకపోకలు నిలిచిపోయాయి.
మరోవైపు, పూసపాటిరేగ మండలం ఎరుకొండలో ఓ ఇల్లు కూలిపోయింది. ఇంట్లో ఉన్న ముగ్గురు వ్యక్తులు వరదనీటిలో కొట్టుకుపోగా స్థానికులు తీవ్రంగా శ్రమించి వారిని కాపాడారు. అస్వస్థతకు గురైన ఆ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కోనాడ గ్రామంలో ఊర చెరువుకు భారీ గండి పడి 50 ఎకరాల్లో వరిపంట పూర్తిగా దెబ్బతింది. అలాగే భోగాపురంలో చెరువుకు గండి పడి రెండు కాలనీలు జలమయం అయ్యాయి. చీపురుపల్లిలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీని కారణంగా 500 ఎకరాల్లో పత్తి, 350 ఎకరాల్లో వరి నీట మునిగాయి. 150 ఎకరాలలో జొన్న పంటకు అపారనష్టం వాటిల్లింది.