
పుట్టేశ్వరుడు (ఫైల్)
సాక్షి, కర్నూలు: అతనికి వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే గుండె ఆగింది. శనివారం చోటుచేసుకున్న ఈ ‘హృదయ’ విదారకర సంఘటన శిరివెళ్లలో విషాదాన్ని నింపింది. బాధితుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శిరివెళ్లలోని తెలుగు పేటకు చెందిన శంకరయ్య (లేట్) రెండో కుమారుడు పుట్టేశ్వరుడు (30) ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. తండ్రి పదేళ్ల క్రితమే చనిపోయాడు. అన్న పాణ్యంలో వివాహం చేసుకుని.. అక్కడే స్థిరపడ్డాడు. దీంతో అతను తమకున్న అర ఎకరా పొలాన్ని సాగు చేయడంతో పాటు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ తల్లిని పోషించేవాడు. ప్రస్తుతం అతనికి కర్నూలుకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది.
ఈ నెల 25, 26 తేదీలలో స్థానిక ఓంకారేశ్వర స్వామి ఆలయంలో వివాహం జరగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి పనులు మొదలయ్యాయి. పుట్టేశ్వరుడు పెళ్లి పత్రికల ముద్రణ కోసం ఈ నెల 17న నంద్యాలకు వెళ్లాడు. అక్కడి నుంచి పాణ్యంలో ఉంటున్న అన్న ఇంటికి చేరుకున్నాడు. కొంత అలసటగా అన్పించడంతో వైద్యం కోసం శనివారం ఉదయం అన్నతో కలిసి నంద్యాల ప్రభుత్వాస్పత్రికి వెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉందని, కర్నూలుకు వెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే గుండెపోటుతో చనిపోయాడు. కుమారుడి మరణ వార్త తెలియడంతో తల్లి నాగమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..)
Comments
Please login to add a commentAdd a comment