గంగారాం (ఫైల్)
కోరుట్ల(జగిత్యాల): పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి.. బంధువులందరూ తరలివచ్చారు. ఇళ్లంతా సందడిగా ఉంది.. భాజాభజంత్రీలతోపాటు సంప్రదాయాలన్నీ పూర్తి చేశారు. ఉదయం 10.30 గంటలకు వివాహ ముహూర్తం.. పెళ్లి కూతురి బంధువులు వరుడిని తీసుకెళ్లడానికి ఉదయం 5 గంటలకే వచ్చారు.. అంతలోనే వరుడి తండ్రి ఛాతిలో నొప్పి వస్తుందంటూ కుప్పకూలి, అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. కోరుట్ల పట్టణానికి చెందిన కూసరి గంగారాం(57) కుమారుడు ప్రశాంత్‌కు మల్లాపూర్ మండలంలోని కొత్తదాంరాజ్‌పల్లిలో ఓ యువతితో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు వివాహం జరగాల్సి ఉంది.
పెళ్లి కుమారుడిని తీసుకెళ్లడానికి వధువు తరఫు బంధువులు ఉదయం 5 గంటలకు కోరుట్ల చేరుకున్నారు. వరుడిని తీసుకెళ్లేందుకు సిద్ధమవుతుండగా అతని తండ్రి గుండెనొప్పితో ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. బంధువులు రెండు ప్రైవేటు ఆస్పత్రుల వద్దకు తీసుకెళ్లినా తెరిచి లేవు. చివరకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం కావడంతో కొన ఊపిరితో ఉన్న గంగారాం మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనతో ప్రశాంత్ వివాహం ఆగిపోయింది. అప్పటివరకు పెళ్లి భాజాలు మోగిన ఆ ఇంట్లో అనూహ్యంగా చావుడప్పులు వినిపించాయి. గంగారాంకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment