పెళ్లంటే జీవితాంతం గుర్తుండిపోయే ఘట్టం. ప్రతి ఒక్కరు తమ వివాహాన్ని ఎంతో ఆర్భాటంగా చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి అందమైన ఈ వేడుకను కొంతమంది చిన్న చిన్న విషయాలతో ముడిపెట్టి.. పెళ్లిని రద్దు చేసుకునే వరకు వెళ్తున్నారు. అమ్మాయి వాళ్లు మర్యాదలు సరిగా చేయలేదని, కట్నం ఎక్కువ ఇవ్వలేదని పెళ్లి క్యాన్సిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వింత వింత కారణాలతో ఏకంగా పీటల మీద కూడా పెళ్లిళ్లు ఆపేస్తున్నారు.
అచ్చం అలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. నిశ్చితార్థం రోజు మటన్‌లో నల్లి బొక్క వడ్డించలేదని ఆగ్రహం చెందిన వరుడి కుటుంబ సభ్యులు చివరికి పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన వధువుకి, జగిత్యాలకు చెందిన వరుడితో వివాహం నిశ్చయమైంది. గత నెల నవంబర్‌లో వధువు ఇంటి వద్ద నిశ్చితార్థం వేడుక నిర్వహించారు.
నిశ్చితార్థం రోజున అమ్మాయి తరపున కుటుంబ సభ్యులు భోజనాలను ఘనంగా ఏర్పాటు చేశారు. వివాహానికి వచ్చిన అతిథులందరికీ నాన్ వెజ్ వంటలు వండించారు. అయితే నిశ్చితార్థం అనంతరం తమకు మటన్‌లో మూలుగ బొక్క వడ్డించలేదని అబ్బాయి బంధువులు చెప్పడంతో గొడవకు దారితీసింది. దీనిపై స్పందించిన వధువు కుటుంబ సభ్యులు మూలుగు బొక్క వంటకాలలో చేయించలేదని చెప్పడంతో గొడవ కాస్తా పెద్దదిగా మారింది.
ఈ వివాదం కాస్తా చివరికి పోలీసుల వరకు చేరుకోవడంతో.. అబ్బాయి కుటుంబ సభ్యులను నచ్చజెప్ప ప్రయత్నం చేశారు. కానీ వారు ససేమిరా అంటూ తమను అవమానించారని అన్నారు. అంతేగాక నల్లి బొక్క మెనూలో లేదన్న విషయాన్ని వధువు కుటుంబసభ్యులు ఉద్దేశపూర్వకంగా తమకు తెలియకుండా దాచిపెట్టారని వాదించారు. చివరికి ఈ పెళ్లి వద్దంటూ వరుడి కుటుంబం తెగేసి చెప్పడంతో వివాహం రద్దు చేసుకున్నారు.
అయితే ఈ ఘటన అచ్చం ఇటీవల టాలీవుడ్‌లో వచ్చిన ‘బలగం’ సినిమాలోని కథను గుర్తు చేసింది. మార్చిలో విడుదలైన ఈ సినిమాలో.. మూలుగ బొక్క కోసం బావ బామ్మర్ధుల మధ్య గొడవ జరిగి విడిపోతారు. ఇక్కడ కూడా అలాగే మూలుగ బొక్క కోసం గొడవ పడి చివరకు పెళ్లి సంబంధం రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment