అనంతపురం క్రైం : సహజీవనం చేస్తున్న ప్రియురాలు పెళ్లి చేసుకోవాలని కోరడంతో, ఆమెని హత్య చేశాడు ప్రియుడు. ఈ నెల 18వ తేదీ రాత్రి చోటు చేసుకున్న ఈ హత్య కేసు వివరాలను త్రీ టౌన్ సీఐ ఆంజినేయులు, ఎస్‌ఐలు రెడ్డెప్ప, తమీమ్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. బుక్కరాయసముద్రానికి చెందిన షేక్ పటాన్‌మున్నికి అనంతపురం రాణినగర్‌లో నివాసముంటున్న దాదావలితో రెండేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన కొన్ని నెలలకే వారి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారు. అనంతపురంలోని నీరుగంటి వీధికి చెందిన కురుబ నారాయణ స్వామి కుమారుడు కురుబ పవన్‌కుమార్ తో పటాన్‌మున్నికి పెళ్లికి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉండేది. దీంతో పటాన్‌మున్ని విడాకులు తీసుకున్న వెంటనే పవన్‌కుమార్ దగ్గరకు వచ్చేసింది. ఈ విషయంపై పవన్‌కుమార్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పవన్‌కుమార్, పటాన్‌మున్ని అనంతపురం రూరల్ మండలం రాజీవ్‌కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని 4 నెలల నుంచి సహజీవనం సాగించారు. ఇప్పుడు తనను వివాహం చేసుకోవాలని పవన్‌కుమార్‌పై పటాన్‌మున్ని ఒత్తిడి చేసింది.
ఈ క్రమంలో రంజాన్ పండుగ రోజు రాజీవ్‌కాలనీ నుంచి పవన్‌కుమార్, మున్ని బైక్‌పై నేషనల్ పార్కుకు వెళ్లారు. రాత్రి 7 గంటలకు బైక్‌పై పార్కు నుంచి బయలుదేరారు. జాతీయ రహదారి పక్కన ఉన్న సరస్వతి బీఈడీ కళాశాల వద్ద పెళ్లి విషయమై చర్చకు దిగారు. 'నిన్ను పెళ్లి చేసుకోలేనని.. ఇలాగే సహజీవనం కొనసాగిద్దాం' అని పవన్‌కుమార్ మున్నితో చెప్పారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో పవన్‌కుమార్ మున్నిని కిందకు నెట్టి ఆమె చున్నీతో గొంతుకు ఉరివేసి హత్యచేశాడు. అటు వైపు వస్తున్న పాదచారులను చూసి పవన్‌కుమార్ పారిపోయాడు. పటాన్‌మున్ని అప్పటికే మృతి చెందినట్లు పాదచారులు గుర్తించి, విషయాన్ని త్రీ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు ప్రారంభించి నిందితున్ని అదుపులోకి తీసుకుని బుధవారం కోర్టులో హాజరు పరిచారు.