Nikki Yadav Murder Case Updates: CCTV Footage Shows Victim Hours Before Incident - Sakshi
Sakshi News home page

Nikki Yadav Murder Case: ప్రియుడి మోసాన్ని గ్రహించని నిక్కీ.. ఆఖరి వీడియో బయటకు..

Published Wed, Feb 15 2023 5:52 PM | Last Updated on Wed, Feb 15 2023 6:23 PM

Nikki Yadav Case Updates: CCTV Shows Victim Hours Before Incident - Sakshi

క్రైమ్‌: శ్రద్ధా వాకర్‌ తరహాలో.. అదీ దేశరాజధానిలోనే వెలుగు చూసిన ‘ఫ్రిడ్జ్‌లో ప్రియురాలి శవం’ ఉదంతం డేటింగ్‌ కల్చర్‌పై మరోసారి చర్చకు దారి తీసింది. ఏళ్ల తరబడి కలిసి ఉన్న ఆమెకు.. ప్రియుడు చేసిన నమ్మక ద్రోహం తెలిశాక నిలదీసింది. అయితే తన దగ్గర సమాధానం లేకపోవడంతో.. వదిలించుకునేందుకు ఆమెను దారుణంగా హత్య చేశాడు.  

మంగళవారం ప్రియుడు సాహిల్‌ గెహ్లాట్‌కు చెందిన ఓ రెస్టారెంట్‌ ఫ్రిడ్జ్‌లో శవమై కనిపించింది నిక్కీ యాదవ్‌. ఛార్జింగ్‌ కేబుల్‌ను మెడకు బిగించి చంపి.. ఆపై ఆ శవాన్ని దగ్గర్లోనే ఉన్న తన కుటుంబానికి చెందిన ధాబాలోని ఫ్రిడ్జ్‌లో దాచిపెట్టాడు సాహిల్‌. 

తన కూతురికి సాహిల్‌ మోసగాడు అని గుర్తించలేకపోయిందని, గుడ్డిగా ప్రేమించి ప్రాణం పొగొట్టుకుందని నిక్కీ తండ్రి విలపిస్తున్నాడు. సాహిల్‌కు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేస్తున్నాడాయన. ఇదిలా ఉంటే.. సెక్యూరిటీ ఫుటేజ్‌ ద్వారా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.

మరోవైపు నిక్కీ యాదవ్‌ చివరిసారిగా కనిపించిన వీడియో ఒకటి పోలీసుల ద్వారా మీడియాకు రిలీజ్‌ అయ్యింది. సౌత్‌ వెస్ట్‌ ఢిల్లీలోని తన ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తున్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఆ రోజు తేదీ ఫిబ్రవరి 9. ఆరోజే హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సాహిల్‌కి చాలారోజుల కిందటే.. మరో యువతితో వివాహం ఫిక్స్‌ అయ్యింది. ఆ విషయం నిక్కీకి తెలియకుండా జాగ్రత్తపడ్డాడు అతను. అయితే..

వివాహానికి ముందురోజు ఆమెకు ప్రియుడి చేస్తున్న మోసం తెలిసింది. దీంతో.. అతన్ని నిలదీసింది.  మరో యువతిని వివాహం చేసుకుంటున్నాడని తెలియగానే.. నిక్కీ అతనితో గొడవకు దిగింది. ఇంట్లోకి వెళ్లిన నిక్కీ.. కాసేపటికే మళ్లీ బయటకు వచ్చింది. ఆపై సుమారు మూడు గంటలపాటు ఇద్దరూ కారులోనే వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫోన్‌ ఛార్జింగ్‌కేబుల్‌ను ఆమె మెడకు బిగించి సాహిల్‌ హత్య చేశాడు. 

నిక్కీ స్వస్థలం హర్యానాలోని ఝాజ్జర్‌. అయితే ఆమె మాత్రం ఢిల్లీలో ఉంటోంది. మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌లకు ప్రిపేర్‌ అవుతున్న క్రమంలోనే నిక్కీ-సాహిల్‌ మధ్య పరిచయం ఏర్పడింది. గత కొన్నేళ్లుగా ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. నిక్కీ కనిపించకుండా పోయిందని పొరుగింటి వాళ్లు ఫిర్యాదు చేయడంతో.. ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. విచారణలో సాహిల్‌ నేరాన్ని అంగీకరించినట్లు పోలీస్‌ వర్గాలు చెప్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement