సాక్షి, జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం చదురుముడిలో దారుణం జరిగింది. చదురుముడికి చెందిన శ్రీను బాబు అనే వ్యక్తి తన కుటుంబసభ్యులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలిలా.. చదురుముడికి చెందిన తిప్పమ్మ, పోతురాజు భార్యాభర్తలు. వీరికి చంటి బాబు, శ్రీను బాబు అనే ఇద్దరు కుమారులున్నారు. తాగుడుకు బానిసైన పెద్దకొడుకైన శ్రీను బాబు మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటుచేసుకున్నాయి.
తల్లిదండ్రులు, తమ్ముడిపై కక్ష పెంచుకున్న శ్రీనుబాబు.. గురువారం రాత్రి వాళ్లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. తీవ్రకాలినగాయాలైన కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం స్థానికులు పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనుబాబు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.