Paderu hospital
-
స్వాతంత్య్రం వచ్చాక మన్యంలో తొలిసారి!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రెండేళ్ల క్రితం వరకు అడవి బిడ్డల ఆరోగ్య పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. చిన్నపాటి జ్వరం వస్తే మన్యం వీడి.. మైదానం వైపు పరుగులు తీసే ఏజెన్సీ ప్రజలకు ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చింది. సాధారణ జ్వరాలకు మాత్రలందించేందుకూ వీల్లేని దుస్థితి నుంచి అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతంగా చేయగలిగే స్థాయికి ఏజెన్సీ ఆస్పత్రులు చేరుకున్నాయి. కాన్పుల కోసం అనకాపల్లి, వైజాగ్ వైపు అష్టకష్టాలు పడి గర్భిణుల్ని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మన్యంలోని ప్రభుత్వాసుపత్రుల్లో రెండు నెలలుగా కాన్పులు నిర్వహిస్తూ తల్లీబిడ్డల్ని కాపాడుకోగలుగుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. మొట్టమొదటి సారిగా రెండు రోజుల వ్యవధిలో రెండు మేజర్ ఆపరేషన్లు పాడేరు జిల్లా ప్రభుత్వాస్పత్రిలో నిర్వహించి రికార్డు సష్టించారు. కాలిలో సిరలు ఉబ్బి నడవడం కష్టంగా మారి ఆస్పత్రిలో చేరిన ఏజెన్సీకి చెందిన వి.చంద్రకళ (30)కు పాడేరు జిల్లా ఆస్పత్రి వైద్యులు సోమవారం వెరికోస్ వెయిన్స్ ట్రెండెలెన్‌బర్గ్ చికిత్సని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా హెర్నియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన జి.నన్నారావు (48)కు మంగళవారం హెర్నియా రిపేర్ శస్త్రచికిత్సను చేశారు. పాడేరు జిల్లా ఆస్పత్రి చరిత్రలో ఈ తరహా ఆపరేషన్లు నిర్వహించడం ఇదే ప్రథమం. ప్రస్తుతం ఇద్దరు రోగులు ఆరోగ్యంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. కలెక్టర్ అభినందన మేజర్ ఆపరేషన్లను మారుమూల మన్యంలో విజయవంతంగా పూర్తి చేసిన వైద్య బందాన్ని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అభినందించారు. ‘ఏజెన్సీ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషలిస్టు డాక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఏజెన్సీలోనే మేజర్ ఆపరేషన్లను చేసే స్థాయికి వచ్చాం’ అని పాడేరు ఐటీడీఏ పీవో గోపాలకష్ణ ‘సాక్షి’కి తెలిపారు. -
480 గ్రాముల శిశువు
పాడేరు: మన్యంలో అతి తక్కువ బరువుతో ఓ శిశువు పుట్టింది. పెదబయలు మండలం గలగండ పంచాయతీ గసాబు గ్రామానికి చెందిన ఉల్లి కృష్ణకుమారి ఆరు నెలల గర్భిణి. ఈ నెల 9న పురిటి నొప్పులు రావడంతో పాడేరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు అబార్షన్ చేయాలని తొలుత వైద్యులు భావించారు. అయితే బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్టు స్కానింగ్‌లో తేలడంతో అదే రోజు అతికష్టం మీద కాన్పు చేశారు. పుట్టిన మగబిడ్డ బరువు కేవలం 480 గ్రాములే ఉండటంతో బేబీ కేర్ యూనిట్లో ఉంచి సేవలందిస్తున్నట్టు డాక్టర్ పి.ప్రవీణ్‌వర్మ చెప్పారు. ఇంత తక్కువ బరువుతో బిడ్డ పుట్టి, ఇప్పటి వరకూ జీవించి ఉండటం రాష్ట్రంలోనే ఇదే ప్రథమమని వైద్యులు చెప్పారు. -
విశాఖ జిల్లాలో దారుణం
సాక్షి, జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లా జి.మాడుగుల మండలం చదురుముడిలో దారుణం జరిగింది. చదురుముడికి చెందిన శ్రీను బాబు అనే వ్యక్తి తన కుటుంబసభ్యులపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ వివరాలిలా.. చదురుముడికి చెందిన తిప్పమ్మ, పోతురాజు భార్యాభర్తలు. వీరికి చంటి బాబు, శ్రీను బాబు అనే ఇద్దరు కుమారులున్నారు. తాగుడుకు బానిసైన పెద్దకొడుకైన శ్రీను బాబు మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతుండేవాడు. దీంతో కొంతకాలంగా కుటుంబంలో కలహాలు చోటుచేసుకున్నాయి. తల్లిదండ్రులు, తమ్ముడిపై కక్ష పెంచుకున్న శ్రీనుబాబు.. గురువారం రాత్రి వాళ్లు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పు అంటించాడు. తీవ్రకాలినగాయాలైన కుటుంబసభ్యులను చికిత్స నిమిత్తం స్థానికులు పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీనుబాబు పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
108 సేవలు ఇంత అధ్వానమా?
♦ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆగ్రహం ♦ పాడేరు ఆస్పత్రిలో తల్లీబిడ్డల ఆరోగ్యం ఆందోళనకరం ♦ విశాఖ తరలింపునకు అందుబాటులో లేని అంబులెన్స్ ♦ జిల్లా కో-ఆర్డినేటర్‌తో మాట్లాడి రప్పించిన ఎమ్మెల్యే పాడేరు రూరల్ : ఏజెన్సీలో 108 సేవలు సక్రమంగా లేవని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. మన్యంలో మాతా,శిశు మరణాలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు ప్రకటిస్తున్నా ఆచరణలో కానరావడంలేదన్నారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే విశాఖపట్నం ఆస్పత్రికి తరలించాలని వైద్యులు చెప్పినప్పటికి 108 వాహనం సకాలంలో అందుబాటులో లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఉదయం పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అత్యవసరంగా విశాఖపట్నం తరలించాలని వైద్యులు సూచించారు. కానీ 108 అంబులెన్స్ అందుబాటులో లేదు. దీనిని బాధితులు పాడే రు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి దష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆమె వెంటనే పాడేరు ప్రాంతీయ ఆస్పత్రికి చేరుకుని తల్లి, బిడ్డల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. 108 సేవల జిల్లా కో-ఆర్డినేటర్‌తో ఫోన్లో మాట్లాడారు. అంబులెన్స్‌ను రప్పించి దగ్గరుండి తల్లి, బిడ్డలను విశాఖపట్నం పంపారు. ఏజెన్సీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆస్పత్రిలో అంబులెన్స్‌లు లేకపోవడం శోచనీయమన్నారు. ప్రత్యేకంగా రెండింటిని ఏర్పాటుకు ప్రభుత్వంతో పోరాడుతానన్నారు. ఎమ్మెల్యే వెంట మాజీ సర్పంచ్ వర్తన పిన్నయ్యదొర, ఏపీటీఎఫ్ నేత గోవింద్, ఇన్చార్జి డాక్టర్ దుర్గారాజు, వైద్యులు శోభరాణి ఉన్నారు.