జమ్మికుంట, న్యూస్‌లైన్ : జమ్మికుంట ఎఫ్‌సీఐ గోదాముల్లో నిల్వచేసిన గోధుమలు పెద్ద ఎత్తున మాయమయ్యా యి. విత్తు తరుగుపోకుండా కాపాడాల్సిన మేనేజరే ఏంచక్కా స్వాహా చేశాడు! ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 620 క్వింటాళ్లు తినేశాడు! ప్రస్తుతం ఈయన రిటైర్ అయ్యారు. ఓపెన్‌యార్డులోని గోధుమలు దొంగలపాలవుతున్నాయని, ఈ సందుచూసి ఇంటిదొంగలు సైతం మింగుతున్నారని ‘సాక్షి’ గతంలోనే హెచ్చరిం చింది. ఉన్నతాధికారులు తేరుకోకపోవడంలో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
పెద్ద ఎత్తున గోధుమలు మాయమైనట్లు ఆలస్యంగా గుర్తించి పోలీసులు ఫిర్యాదు చేశారు. విచిత్రమేంటంటే గోధుమలు పోయాయని చెప్పిన చోట ఆ బస్తాల ఆనవాళ్లు మచ్చుకైనా కానరాకపోగా.. బండరాళ్లు అధికారుల నిర్లక్ష్యాన్ని వెక్కిరిస్తున్నాయి. 2011-12లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన 5,23,836 బస్తాల గోధుమలు జమ్మికుంటలో దిగుమతి కాగా, ఎఫ్‌సీఐలో ఓపెన్‌యార్డులో నిల్వ చేశారు. ఒక్కో బస్తా 50 కిలోలు ఉంటుంది. వీటిలోంచి కొన్ని బస్తాలు మళ్లీ పంజాబ్ పంపించగా... ఇప్పటికీ ఇక్కడ 2,600 క్వింటాళ్లు నిల్వ ఉన్నాయి.
భద్రత లేకుండా నిల్వలు చేయడంతో ఓపెన్‌యార్డు నుంచి గుర్తుతెలియని వ్యక్తులు గోధుమ బస్తాలను ప్రహరీపైనుంచి ఎత్తుకెళ్లారు. ఓరోజు రాత్రి ఇద్దరు వ్యక్తులు రెండు క్వింటాళ్ల గోధుమలు దొంగిలిస్తుండగా ధర్మారం గ్రామస్తులు వెంబడించారు. దీంతో సదరు వ్యక్తుల సైకిళ్లు విడిచిపెట్టి పరారయ్యారు. గ్రామస్తులు గోధుమ బస్తాలను గ్రామపంచాయతీలో భద్రపరిచారు. ఈ వైనంపై ‘గోదాములు దాటుతున్న గోధుమలు’ శీర్షికన ‘సాక్షి’ రెండేళ్ల క్రితమే కథనం ప్రచురించింది. ఈ క్రమంలో పంజాబ్‌కు చెందిన ఎఫ్‌సీఐ, సివిల్ సప్లయ్ అధికారులు జమ్మికుంటలో నిల్వ ఉన్న గోధుమలు పరిశీలించారు. మూడు రోజులపాటు ఓపెన్‌యార్డుల్లో ఉన్న బస్తాలన్నింటినీ లారీల్లో వేబ్రిడ్జి తూకాలు వేశారు.
నిల్వల్లో భారీగా తేడాలున్నట్లు నాడు వెల్లడించారు. నివేదిక ఉన్నాధికారులకు సమర్పిస్తున్నట్లు అప్పుడు చెప్పారు. తాజాగా మే నెలలో తొమ్మిది వేల టన్నుల గోధుమలు రాగా, ఓపెన్‌యార్డుల్లో 76 చోట్ల స్టాక్ పాయింట్లలో నిల్వ ఉంచారు. జూన్‌లో ఎఫ్‌సీఐ డిపో మేనేజర్‌గా చిన్న నారాయణ బాధ్యతలు స్వీకరించే సమయంలో గోదాముల్లోని నిల్వలన్నింటినీ పరిశీలించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రీజినల్ విజిలెన్స్ స్క్వాడ్(ఆర్‌వీఎస్) అధికారులు ఈ నెల 12, 13 తేదీల్లో గోధుమలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డుల అధారంగా 5/9,5/10 ప్లీంత్‌ల్లో 1240 గోధుమ బస్తాలు మాయం అయినట్లు నిర్ధరించారు. నిల్వలకు, రికార్డులకు మధ్య ఈమేరకు తేడా ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ రూ.9 లక్షలు ఉంటుందని వెల్లడించారు. విషయాన్ని ఎఫ్‌సీఐ ఏరియా మేనేజర్‌కు తెలుపగా, ఆయన స్థానిక పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. జూన్‌లో డిపో మేనేజర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన సంజీవరావు ఈ గోధుమలు మాయం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎగుమతి, దిగుమతి రిజిస్టర్లు సొంతంగా నిర్వహించి, అక్రమాలకు పాల్పడినట్లు అందులో పేర్కొన్నారు.
దీంతో సంజీవరావుపై కేసు నమోదు చేసినట్లు సీఐ భూమయ్య వెల్లడించారు. దీంతో అసలు ఎఫ్‌సీఐలో ఏం జరుగుతుందోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు ‘సాక్షి’లో కథనం ప్రచురించి అప్రమత్తం చేసినా పట్టించుకోకపోవడంతోనే ఈ అక్రమాల దందా ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
గోధుమలు గోవిందా..!
Published Sun, Sep 22 2013 4:38 AM | Last Updated on Fri, Sep 1 2017 10:55 PM
Advertisement
Advertisement