సాక్షి, తిరుపతి : కాలం ఎల్లవేళలా మనది కాదని ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు. ఏపీ ప్రభుత్వం నుంచి రావల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ ఆయన శుక్రవారం తిరుపతిలో విద్యార‍్థులతో కలిసి ధర్నాకు దిగారు. ఈ ధర్నా కార్యక్రమంలో మంచు విష్ణు, మనోజ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ...‘చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం చేశారు. అందర్నీ మోసం చేశారు. ఫీజులే చెల్లించని చంద్రబాబు ఇంకా యువతకు ఏమి ఉద్యోగాలు ఇస్తారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే మహానుభావుడు ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. మంచి చేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. ఆ ముఖ్యమంత్రులు ఆ పథకాలు ప్రారంభిస్తే నేను ఎందుకు ఇవ్వాలని చెప్పు అప్రిషియేట్ చేస్తా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓటు వేస్తే నీచంగా మోసం చేశావు. చదవండి....(తిరుపతిలో రోడ్డుపై మోహన్ బాబు ధర్నా)
మహానుభావుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకే సభ్యత్వం లేకుండా చేశారు. అసలు టీడీపీ నీది కాదు. నీవు అన్నగారి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు. ఆయనపై ఉన్న అభిమానంతోనే నేతలు ఆ పార్టీలో ఉన్నారు. నా పార్టీ నా పార్టీ అంటావేంటి చంద్రబాబు...అది ఎన్టీఆర్ పార్టీ. సరే నీ కర్మ, దానితో నాకు సంబంధం లేదు. ప్రజలే బుద్ధి చెబుతారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని లేఖ రాస్తే అంత పొగరా?, అహంకారామా?. పగలు, రాత్రిలా ....అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తుందో... అలాగే చంద్రబాబు కాలం ఎల్లవేళలా మనది కాదు అది గుర్తు పెట్టుకో.
అన్ని కోట్లు సంపాదించిన నువ్వు రేపు ఏమవుతావో?. మనిషే శాశ్వతం కాదు...ఇంకా పదవి కూడా కాదనేది గుర్తు పెట్టుకో. బకాయిలుపై ఒకసారి చెప్పాం. ఇప్పుడు హెచ్చరిస్తున్నాం. తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు న్యాయం చేయాలని విన్నవించుకుంటాం. కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తాం. చంద్రబాబు విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించేవాడు అయితే వెంటనే వాళ్ల ఫీజులు చెల్లించాలి. ఆయన చెప్పే హామీలన్నీ అసత్యాలు. అబద్దాలకోరు, అసత్యాలు మాట్లాడే చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే మంచి గుణపాఠం చెబుతారు. ఇన్నాళ్లకు ఆయనకు పసుపు-కుంకుమ గుర్తుకు వచ్చిందా?’ అని ప్రశ్నలు సంధించారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment