చంద్రగిరి: పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం కాకూడదని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి జీవం పోశారని సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మంచు మోహన్‌బాబు అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షం వేయడం కాదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సీఎం చంద్రబాబుకు సూచించారు. శనివారమిక్కడ తన కాలేజీలో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఆయన తన ఆవేదన వెళ్లగక్కారు. 26 సంవత్సరాలుగా 25 శాతం ఉచిత విద్యనందిస్తున్నాని చెప్పారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బుతో ఈ సంస్థలను స్థాపించానన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా కోట్లాది మంది యువకులు లబ్ధి పొందారని గుర్తు చేశారు. ఎంత మంది ముఖ్యమంత్రులు మారినా.. ఈ పథకాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చారన్నారు.
చంద్రబాబుతో కొన్నేళ్లుగా మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. కానీ 2014 నుంచి 2019 విద్యాసంవత్సరం వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన మండిపడ్డారు. శ్రీ విద్యానికేతన్‌కు ప్రభుత్వం నుంచి సుమారు రూ.19.24 కోట్ల బకాయి రావాల్సి ఉందన్నారు. గతంలో అన్ని సామాజిక వర్గాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించేవారన్నారు. అయితే ఇటీవల కాపు సామాజిక వర్గానికి మాత్రం ప్రత్యేకంగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ తన విద్యాసంస్థల్లో చదువుతున్న కాపు సామాజికవర్గానికి చెందిన విద్యార్థులకు 2018–19 విద్యాసంవత్సరానికి గానూ రూ.2.16 కోట్లు పెండింగ్‌లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తామంటే కచ్చితంగా ఇవ్వాలి గానీ.. ఇలా అడిగినప్పుడు పదోపరకో భిక్షం వేయడం తగదని మండిపడ్డారు. గతంలో ఏడాదికి నాలుగుసార్లు విడతల వారీగా ఫీజు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం.. వాటిని చెల్లించడంలో కూడా మాటతప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరుసార్లు సీఎంకు లేఖ రాశాను..
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని సీఎం చంద్రబాబుకు తానే స్వయంగా ఆరుసార్లు లేఖ రాసినట్లు మోహన్‌బాబు చెప్పారు. కానీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా.. తాను పంపిన లేఖలను బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. ఇలాగైతే విద్యార్థులు ఎలా చదవాలి? అధ్యాపకులకు జీతాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దని సూచించారు. ఎన్నికలు వస్తే నాయకులు నెరవేర్చలేని హామీలిస్తున్నారని.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమతున్నారని దుయ్యబట్టారు. వారం క్రితం కూడా తాను సీఎం చంద్రబాబుకు లేఖ రాశానని, అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం రాలేదన్నారు. అందుకే మీ ముందుకు రావాల్సి వచ్చిందని విద్యార్థులకు చెప్పారు. ఆకలిబాధలు తెలిసిన వాడిని కాబట్టే.. మా పిల్లలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని.. కేవలం తన బిడ్డల్లాంటి విద్యార్థుల భవిష్యత్ కోసం ఉద్యమిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment