పాలకొండ: ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచేందుకు ఏర్పాటైన క్లస్టర్ కో-ఆర్డినేటర్(సీఆర్పీ) వ్యవస్థకు మంగళం పాడించేందుకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ఈ మేరకు విద్యాశాఖలో మంతనాలు సాగుతున్నాయి. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సీఆర్‌పీలను తొలగించి ఎంఆర్‌పీలనే కొనసాగించాలని సర్కార్ భావి స్తోంది. ఇందుకోసం అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరిగే లా చేసి ఈ వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. సీఆర్‌పీ వ్యవస్థను 2011లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అప్పటివరకు ఎంఆర్‌పీల వ్యవస్థ కొనసాగేది. ఉపాధ్యాయులనే అర్హతను బట్టీ ఎంఆర్‌పీలుగా నియమించి పాఠశాలల పర్యవేక్షణ బా ధ్యతను అప్పగించారు.
2011లో ఈ వ్యవస్థను రద్దు చేసిన అప్పటి ప్రభుత్వం రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) ద్వారా నిరుద్యోగులకు క్లస్టర్ కో-ఆర్డినేటర్ల పేరుతో పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. దీని కోసం అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించుకొని రాజీవ్ విద్యామిషన్ ఉన్నతాధికారులు ఎంపికలు చేపట్టారు. ఇలా జిల్లాలో 285 క్లస్టర్లలో 285 మంది నిరుద్యోగులను నెలకు రూ.8,500 చొప్పున చెల్లించేలా నియమించారు. వీరు పాఠశాలల పర్యవేక్షణ, స్కూల్ కాంప్లెక్స్‌ల నిర్వహణ, విద్యార్థుల వివరాల సేకరణ తదితర అంశాలపై పర్యవేక్షణ జరిపి మండల విద్యాశాఖకు, రాజీవ్ విద్యామిషన్‌కు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు జిల్లాలో 38 మండలాలకు 38 మంది మండల కో-ఆర్డినేటర్లు, 38 మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఈ విధానంలో పనిచేస్తున్నారు.
ఖర్చు తగ్గించేందుకే...
ఔట్‌సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న సీఆర్‌పీలను తొలగించి ఖర్చు తగ్గించేందుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యా విధానాన్ని చూపిస్తోంది. ఒక ఆంధ్రాలో తప్పితే మిగతా రాష్ట్రాల్లో ఎంఆర్‌పీ వ్యవస్థే కొనసాగుతోంది. ఇదే విషయమై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది నుంచి ఎంఆర్‌పీ వ్యవస్థ కొనసాగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ విధానాన్ని అమలు చేస్తే ప్రస్తుతం విధుల్లో ఉన్న నిరుద్యోగులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది.
సీఆర్పీ వ్యవస్థకు మంగళం !
Published Sat, Feb 28 2015 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement