మూత‘బడే’నా!
మూత‘బడే’నా!
Published Thu, May 11 2017 11:08 PM | Last Updated on Tue, Sep 5 2017 10:56 AM
ప్రాథమికోన్నత పాఠశాలల రద్దుకు సర్కారు యోచన
పాఠశాల వివరాల సేకరణలో ప్రభుత్వం
వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ వర్గాలు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ రద్దుకే ఈ కుట్ర : నిరుద్యోగులు
అధికారంలోకి ఎవరొచ్చినా ముందుగా ప్రయోగాలకు వేదికయ్యేది విద్యాశాఖే. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ఇప్పటికే విద్యావ్యవస్థ భ్రష్టుపట్టిపోగా.. తాజాగా విద్యార్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై ఉపాధ్యాయ, నిరుద్యోగ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
- భానుగుడి(కాకినాడ)
జిల్లా వ్యాప్తంగా 331 మండల పరిషత్ ప్రాథమికోన్నత, 12 మున్సిపల్ ప్రా«థమికోన్నత, 31 ఎయిడెడ్ ప్రాథమికోన్నత, 43 ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలున్నాయి. ఇందులో 36,230 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం తొలుత పదిమంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న పాఠశాలలను మూసివేయాలని, 19 మంది విద్యార్థులుంటే ఒక ఉపాధ్యాయుడిని, 60 మంది విద్యార్థులకు 1:30 నిష్పత్తి చొప్పున ఇద్దరు ఉపాధ్యాయులను నియమించాలని యోచించింది. అయితే దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వకపోయినా.. ప్రస్తుతం విద్యాశాఖాధికారుల నుంచి జిల్లాలో ఉన్న ప్రా«థమికోన్నత పాఠశాలలు, విద్యార్థులు, ఇతర వివరాలను సేకరిస్తోంది. ఇవి పాఠశాలలను రద్దు చేసే వ్యూహంలో భాగమేనని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
లంక గ్రామాల పరిస్థితేంటి?
ఉన్నత పాఠశాలలు ఇకటి నుంచి రెండు కిలోమీటర్ల దూరం ఉంటే ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేశారు. జిల్లాలో లంక గ్రామాలన్నీ ఉన్నత పాఠశాలలకు 5 కి.మీ. దూరంలో ఉన్నాయి. అక్కడి నుంచి విద్యార్థులు సైకిల్, కాలిబాటన వచ్చే అవకాశాలు లేవు. ఉన్నత పాఠశాలలకు దూరంగా ఉన్న ప్రాథమికోన్నత పాఠశాలలు జిల్లాలో 100కి పైగా ఉన్నట్టు అంచనా. వీటిని మూసివేస్తే ఆయా గ్రామాల్లోని విద్యార్థులు సుదూర ప్రాంతాలకు రాలేక శాశ్వతంగా విద్యకు దూరమయ్యే అవకాశం ఉంది.
ఇది ముమ్మాటికీ డీఎస్సీని అడ్డుకోవడమే
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కేస్తోందని నిరుద్యోగ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల మూసివేత వంటి చర్యలు భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకుండా చేసే యోచనే అని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
పాఠశాలల మూసివేతకు వ్యతిరేకం
ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న చర్యలకు యూటీఎఫ్ పూర్తి వ్యతిరేకం. తక్షణమే ఆ ఆదేశాలను వెనక్కితీసుకోవాలని కోరాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకు పోరాటం చేస్తాం. ప్రాథమికోన్నత పాఠశాలలనే పూర్తిగా మూసివేయాలన్న ఆలోచనే కరెక్ట్ కాదు.
- బీవీ రాఘవులు, యూటీఎఫ్ జిల్లా అ««ధ్యక్షుడు.
విద్యాహక్కు చట్టాన్ని కాలరాయడమే.
విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలు మూసివేయాలని నిర్ణయించడం ముమ్మాటికీ విద్యాహక్కు చట్టాన్ని కాలరాయడమే. ప్రాథమికోన్నత పాఠశాలలను మూసివేయాలన్న జీవో వచ్చిన తక్షణమే ఆందోళనలతో రోడ్డెక్కడానికి సిద్ధంగా ఉన్నాం.
-పి. సుబ్బరాజు, ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ
పనికిమాలిన చర్య
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధికి పాటుపడాల్సిన ప్రభుత్వం విద్యార్థులు లేరని పాఠశాలలను మూసివేయడం పనికి మాలిన చర్య. ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లు, సబ్జెక్టు నిపుణులు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి విద్యార్థుల సంఖ్య పెరగకుంటే అప్పుడు పాఠశాలలను మూసివేయాలి గానీ వసతులు లేకుండా విద్యార్థులు లేరని మూసివేయడం తగదు.
కేవీ శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ
సంఘటితంగా పోరాడతాం.
జాక్టో, ఫ్యాప్టోలతో పాటుగా, నిరుద్యోగ సంఘాలను సైతం కలుపుకుని ఈ విషయమై పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిస్తే ఇప్పటి వరకు విజయం సాధించలేని విషయమేదీలేదు. ఈ నిర్ణయం ప్రతీ పేద విద్యార్థికి చేటుచేసేదే గనుక అంతా సంఘటితమై ఖండించాలి.
- చింతాడ ప్రదీప్‌కుమార్, ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ
Advertisement
Advertisement