బడిబాటకు మంగళం
మచిలీపట్నం : ఏటా జూన్ ఒకటో తేదీ నుంచి వారం రోజుల పాటు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ప్రభుత్వం ఈ ఏడాది ఆ ఊసే ఎత్తకపోవటం గమనార్హం. ఈ నెల 15 నుంచి 21 వరకు బడిబాట జరిగే అవకాశం ఉందని, దీనికి సంబంధించి బుధవారం సాయంత్రానికి కూడా ఎలాంటి ఉత్తర్వులూ విడుదల కాలేదని విద్యా శాఖాధికారులు చెబుతున్నారు. బుధవారం విద్యా శాఖాధికారులతో జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో బడిబాటకు సంబంధించి ఎలాంటి సమాచారాన్నీ ఉన్నతస్థాయి అధికారులు ప్రస్తావించలేదు.
ఈ నెల మొదటి వారంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో అప్పుడే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించామని అధికారులు చెప్పటం గమనార్హం. ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు లేకుండా బడిబాటను ఎలా పూర్తిచేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ పట్టించుకోని ప్రభుత్వం ఆదర్శ పాఠశాలల పేరుతో 30 మంది కన్నా తక్కువ మంది ఉన్న పాఠశాలలను రద్దు చేసేందుకు ప్రత్యేక జీవో జారీ చేయటం చర్చనీయాంశమైంది.
జిల్లాలో 3256 పాఠశాలలు
జిల్లాలో 3256 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2.55 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో 2936 మంది బడిబయట ఉన్న బాలలను గుర్తించి వారిలో 2763 మందిని పాఠశాల్లో చేర్చినట్లు విద్యాశాఖ లెక్కలు చెబుతున్నాయి. ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నప్పటికీ ఇటు ఉపాధ్యాయులు, పాలకులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
పాఠశాలలు ప్రారంభమైన తరువాత బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తే ప్రయోజనం ఎంతవరకు ఉంటుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు గత మూడు నెలలుగా ఇంటింటికి తిరిగి పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించాలని ప్రచారం చేసుకుంటుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంతవరకు ఈ కార్యక్రమం ప్రారంభం కాకపోవటం గమనించదగ్గ అంశం. జూన్ నెలాఖరులో బడిబాట నిర్వహిస్తే అప్పటికి విద్యార్థులంతా ప్రైవేటు పాఠశాలల్లో చేరిపోతారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థులను ఎక్కడి నుంచి తీసుకువస్తారో పాలకులకే తెలియాలి.
పాఠ్య పుస్తకాల కొరత
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20.70 లక్షల పుస్తకాలు అవసరం ఉంది. ఇప్పటివరకు 13.60 లక్షల పుస్తకాలు మాత్రమే వచ్చినట్లు డీఈవో కె.నాగేశ్వరరావు తెలిపారు. వీటిలో 11.59 లక్షల పుస్తకాలను పాఠశాలలకు పంపించామన్నారు. మరో ఏడు లక్షల పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉందని, ఈ నెల 15వ తేదీ నాటికి వాటిని పంపే అవకాశముందని ఆయన చెప్పారు. వివిధ తరగతులకు సంబంధించి ఇంగ్లిష్, హిందీ, తెలుగు పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రాలేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.