ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు అసలే లేవట..! జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న అన్ని స్కూళ్లకూ ప్రభుత్వ గుర్తింపు ఉందట..! జీవో 1 ప్రకారం అన్ని స్కూళ్లలోనూ అవసరమైన మౌలిక వసతులున్నాయట.. సమస్యలు ఉన్న ప్రైవేట్ స్కూళ్లు ఒక్కటీ లేదట.. ఇదీ మండల విద్యాధికారులు క్షేత్రస్థాయికెళ్లి పరిశీలించి నిర్ధారించిన అంశాలు..! అసలు జీవో 1లో ఏముందో తెలుసుకున్నారో లేదో.. కానీ ఎంఈవోలు మాత్రం ప్రైవేట్ పాఠశాలలకు బాసటగా నిలిచారు. ప్రైవేట్ స్కూళ్లకు వెళ్లిన కొందరు గుర్తింపు పత్రం చూసి వెనుదిరిగితే.. ఇంకొందరు అసలు స్కూళ్లలోనే అడుగుపెట్టలేదు. బహుకొద్ది మందే వసతుల గురించి ఆరా తీశారు. అనుమతి లేని స్కూళ్ల వివరాలివ్వని ఎంఈవోలను విద్యాశాఖ గుడ్డిగా నమ్మింది. దీంతో జిల్లాలో అనుమతి, గుర్తింపు లేని పాఠశాలలు అసలే లేవని నిర్ధరణకు వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా.. ఈ టెక్నో, టెక్నో, ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, ప్లే స్కూల్, ఐఐటీ, కాన్సెప్ట్ పేర్లతో కొనసాగుతున్న స్కూళ్లకూ తోకపేర్లు మార్చుకోవాలని నోటీసులు జారీ చేయలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఆదేశాలు బేఖాతర్..
విద్యా సంవత్సరం పునఃప్రారంభానికి ఒక్కరోజే మిగిలి ఉం ది. ఈ నేపథ్యంలో జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి (గుర్తింపు) లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాల లను గుర్తించి ఆయా యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. 20 రోజుల క్రితమే డీఈవో సత్యనారాయణరెడ్డి ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు వెళ్లి గుర్తింపు ఉందా..? జీవో 1 ప్రకారం అన్ని వసతులున్నాయో..? లేవో ? పరిశీలించి నివేదిక ఇవ్వాలన్నారు. అ యినా.. ఇంత వరకు జిల్లాలో ఏ ఒక్క మండలం నుంచి నివేదికలు డీఈవోకు అందలేదు. దీంతో జిల్లాలో అన్ని పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు ఉందని డీఈవో సత్యనారాయణరెడ్డి నిర్ణయానికొచ్చారు. ఇంతవరకు జిల్లాలో ఏ ఒక్క పాఠశాలకు నోటీసు జారీ చేయలేదు. మరోపక్క.. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు చదువు దోపిడీకి సిద్ధమవుతున్నా యి. ప్రస్తుతం జిల్లాలో 800లకు పైగా ప్రైవేట్ పాఠశాలలుం డగా.. వాటిలో రెండొందలకు పైగా పాఠశాలలు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. అనుమతి పొంది కొనసాగుతున్న పాఠశాలల్లో కనీస వసతులు కూడా కరువయ్యాయి.
మొక్కుబడి తనిఖీలు..
ప్రైవేట్ పాఠశాలల్లో భౌతిక వసతులైన సరిపడా తరగతి గదులు, భవన నిర్మాణ నాణ్యత ధ్రువీకరణ పత్రం, ఆటస్థలం, లైబ్రరీ, ప్రహరీ, అగ్నిమాపక శాఖ జారీ చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స, కంప్యూటర్ గది, సిబ్బంది గదులు, విద్యార్థినీ, విద్యార్థులకు ప్రత్యేకంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు కచ్చితంగా ఉండాలి. ఆ పాఠశాలకే అనుమతి ఇవ్వాలని జీవో నెం 1 చెబుతోంది. దీంతోపాటు స్కూలు భవనం ఒకటికి మించి పై అంతస్తులుంటే గ్రిల్స్ ఏర్పాటు చేశారా..? లేదా..? అని అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలి. పాఠశాల అద్దె భవనంలో నిర్వహిస్తే లీజ్ డీడ్, సొంత భవనంలో నిర్వహిస్తే ఓనర్‌షిప్ సర్టిఫికెట్లు నిశితంగా పరిశీలించాలి. కానీ జిల్లాలో సుమారు రెండొందలకు పైగా స్కూళ్లలో మౌలిక వసతులు లేవు. కనీసం మూత్రశాలలు కూడా లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారు. ఒకే భవనంలో తరగతుల నిర్వహణ.. హాస్టల్ కొనసాగుతోంది. అందులోనే వంట.. భోజనశాలలు నిర్వహిస్తున్నారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగినా, వంటగదిలో సిలిండర్ పేలినా విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఇన్ని సమస్యలున్నా.. విద్యాశాఖాధికారులు మాత్రం ఎప్పటిలాగే ఈ సారీ కన్ను మూసుకున్నారు. ఈ విషయమై డీఈవో సత్యనారాయణరెడ్డి స్పందిస్తూ.. 'ఎంఈవోల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు రాలేదు. అందుకే అన్ని ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు ఉందనే నిర్ధారణకు వచ్చాం. ఏవైనా ఫిర్యాదులొస్తే నోటీసులిస్తాం'అని చెప్పుకొచ్చారు.
ప్రై'వేటు' వేయరేం..!
Published Tue, Jun 16 2015 7:39 AM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM
Advertisement