అభివృద్ధికి మంగళం | Mangalam to the development of | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి మంగళం

Published Mon, Jul 7 2014 12:25 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

అభివృద్ధికి మంగళం - Sakshi

అభివృద్ధికి మంగళం

  •        ఎమ్మెల్యేలకు నిధుల షాక్
  •      అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి పథకం అటకెక్కినట్లే!
  •      నిధుల కొరత సాకుతో ఎత్తేసేందుకు ప్రభుత్వం ఎత్తుగడ
  •      జిల్లాకు ఇంకా నిధులు రాకపోవడంతో శాసనసభ్యుల్లో ఆందోళన
  • సాక్షి, విశాఖపట్నం : అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి పథకం అటకెక్కనుంది. నిధుల కొరత సాకుగా చూపి దీన్ని ఎత్తేయాలని ప్రభుత్వం ఎత్తుగడ వేస్తోంది. కోటి ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలకు నిధుల షాక్ ఇవ్వనుంది. టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నెల రోజులు గడిచినా ఇంత వరకు ఈ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. వారం రోజులుగా ఎమ్మెల్యేలు అధికారులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నా తమకేం తెలియదంటూ

    అటు నుంచి సమాధానం వస్తోంది.

    కోటి ఆశలు ఆవిరి : అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి ఏన్నో ఏళ్ల నుంచి ఏడీసీపీ పథకం అమలవుతోం ది. దీనికింద ఒక్కో ఎమ్మెల్యేకు ఏటా కోటి రూపాయలను ప్రభుత్వం  విడుదల చేస్తోంది. నియోజకవర్గంలో సమస్యలను గుర్తించి వాటిని జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ (సీపీవో)కు ఎమ్మెల్యే అందిస్తే అధికారులు మూడునెలలకోసారి నిధులు విడుదల చేస్తారు. ఈ పథకం ఎమ్మెల్యేలకు కాసుల వర్షం కురిపించడంతోపాటు వారి అనుచరులకూ ఇదే ఉపాధి చూపుతోంది. దీంతో ఎమ్మెల్యేలు ఈ పథకంపై ఎన్నో ఆశలుపెట్టుకుంటారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ పథకానికి నిధులు విడుదల చేయలేదు.

    వాస్తవానికి ఈపాటికే కొత్త ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు విడుదల చేయాలి. అటు జిల్లా అధికారులు సైతం ఈ పథకం నిధుల కోసం ప్రయత్నిస్తుంటే ప్రభుత్వం నుంచి కనీసం సమాధానం రావడంలేదు. దీంతో అసలు ఈ పథకం ఉంటుందా?, లేదా? అనేదానిపై అధికారుల్లోనూ అనేక అనుమానాలున్నాయి. అటు కొత్త ఎమ్మెల్యేలు ముఖ్యప్రణాళిక శాఖ అధికారులకు కొన్ని రోజులుగా మా నిధులొచ్చాయా? అంటూ నిత్యం అదే పనిగా ఫోన్లు చేస్తున్నారు. అధికారుల నుంచి సమాధానం రాకపోవడంతో ఇప్పుడు వీరందరిలో గుబులు పట్టుకుంది. తమకు పూర్తిస్వేచ్ఛ ఉన్న ఈ పథకం ఇంకా అమలుకాకపోవడంతో వీరిలో ఆందోళన మొదలయింది.

    ఇప్పటికే జిల్లా ఇన్‌చార్జి మంత్రుల నియామక విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఇన్‌చార్జి మంత్రి కోటాలో వచ్చే ఏసీడీపీ నిధులు కూడా పోయినట్లయ్యాయి. అటు జిల్లా సమీక్ష సమావేశాన్ని (డీఆర్‌సీ) కూడా ప్రభుత్వం అటకెక్కించేసింది. ఇలా వరుసపెట్టి ఎమ్మెల్యేలకు టీడీపీ ప్రభుత్వం షాక్‌లు ఇస్తుండడంతో కొత్త ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఒక రకంగా నియోజకవర్గంలో వీరి పెత్తనానికి చెక్ పెడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement