
తింటే ‘రంగు’ పడుద్ది!
విశాఖ::మాధుర్యాన్ని పంచి... ఆరోగ్యాన్ని పెంచాల్సిన మామిడి పండ్లు విషపూరితమవుతున్నాయి. గతంలో పక్వానికి వచ్చిన మామిడికాయలను వారం రోజుల పాటు గడ్డిలో మగ్గిస్తే ఘుమఘుమలాడేవి. అవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరేది. ఇప్పుడంతా వ్యాపారమయమైపోయింది. మార్కెట్‌లో కనిపించే నిగనిగలాడే మామిడి పండ్ల వెనక వ్యాపారుల మాయాజాలం ఉంది. అవేవీ పక్వానికి వచ్చినవి కావు.
మధుర ఫలంలో విషం
మామిడి పండ్లపై కాలుష్యం కార్బయిడ్, ఎథోఫాన్, బిగ్‌ఫాన్ తదితర రసాయనాలు జల్లుతున్నారు. రెండు రోజుల్లోనే పచ్చిమామిడి కాయలకు రంగు రప్పిస్తున్నారు. దీంతో పండ్లు సహజత్వం కోల్పోయి విషపూరితం అవుతున్నాయి. రుచి కూడా పెద్దగా ఉండటం లేదు.
ప్రస్తుతం మామిడికాయల సీజన్ కావడంతో మామిడికాయలను వ్యాపారులు కార్బయిడ్ రసాయనంలో మగ్గబెడుతున్నారు. చూడగానే ఆకర్షణీయమైన రంగుతో నోరూరిస్తున్నా రుచి మాత్రం ఉండటం లేదు. సాధారణంగా మామిడికాయలను ఎండుగడ్డిలో పెట్టివారం రోజుల పాటు మగ్గబెట్టాలి. అదీ పక్వానికి వచ్చిన కాయలనే ఉపయోగించాలి.
బహిరంగంగా కార్బయిడ్ విక్రయం
హోల్‌సేల్ వ్యాపారులు మాత్రం ప్రభుత్వం నిషేధించిన, కారుచౌకగా దొరికే కార్బయిడ్‌ను ఉపయోగిస్తున్నారు. ఇది మార్కెట్‌లో కిలో రూ.70 నుంచి 90 వరకు దొరుకుతోంది. దీన్ని కాగితంలో చుడతారు. దానిపై గడ్డి వేసి మామిడి కాయలను పేర్చుతారు. కాయలు ఎక్కువగా ఉన్నట్టయితే మధ్యమధ్యలో కార్బయిడ్ పొట్లాలను ఉంచుతారు. గాలి చొరబడకుండా ఉండేందుకు తలుపులు మూసివేస్తారు.
రసాయనాల వేడికి రోజు గడవకముందే ఆకుపచ్చని మామిడి కాయలు, పసుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఇది కాకుండా మరో విధానాన్ని కూడా వారు అనుసరిస్తున్నారు. లీటర్ నీటిలో మిల్లీగ్రాము ఎథోఫాన్ ద్రావణాన్ని కలిపి కాయలపై జల్లుతున్నారు. దీంతో రెండ్రోజులకే రంగు మారుతున్నాయి. అనంతరం పండ్లను హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్డ్ వ్యాపారులు, వినియోగదారులకు విక్రయిస్తున్నారు.
ఈ పండ్లు తింటే రోగాలు మెండు
కార్బయిడ్, ఎథోఫాన్‌తో మగ్గించిన మామిడి పండ్లను తింటే ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. గ్యాస్ట్రిక్, జీర్ణవ్యవస్థలో సమస్యలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు. ఈ పండ్లను తింటే గర్భిణుల్లో పిండం ఎదుగుదల లోపిస్తుందని, వివిధ రకాల జబ్బులు ఏర్పడే ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. నరాల బలహీనత, రక్తహీనత వంటి జబ్బులు కూడా సంక్రమిస్తాయంటున్నారు. పిల్లలు శ్వాసకోశ, డయేరియా తదితర వ్యాధుల బారిన పడే అవకాశం ఉందంటున్నారు. రసాయనాలు జల్లి మగ్గించిన పండ్ల అమ్మకాలను నిరోధించాలని, వ్యాపారులను కఠినంగా శిక్షించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.