కాంగ్రెస్‌లో బ్రిటీష్ భావజాలం
దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు విమర్శ
యర్రగొండపాలెం : భారత్ నుంచి బ్రిటీష్ పాలకులు వెళ్లి పోయిన తర్వాత 60 ఏళ్లపాటు పాలించిన స్వదేశీయుల్లో బ్రిటీష్ భావజాలం గల వ్యక్తులున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. యర్రగొండపాలెంలో గురువారం భారతీయ జనతాపార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బ్రిటీష్ రాజుల భావాజాలంతో ఉన్న వ్యక్తులు దేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించడం వల్లే అభివృద్ధికి నోచుకోలేదని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను దుయ్యబట్టారు.
పవిత్రమైన భావాజాలంతో దేశ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారని చెప్పారు. పనికిమాలిన 70 చట్టాలను మోదీ రద్దు చేశారన్నారు. గుజరాత్ అల్లర్ల విషయంలో ప్రపంచ మీడియా ఆసరాగా చేసుకుని మోదీని ఒక క్రూరుడిగా చిత్రికరించారన్నారు. భారతీయ యువశక్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటిచెబుతున్న మోదీ నాయకత్వంలో.. బీజేపీ పేదల పార్టీగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రాహుల్ కోసమే రాష్ట్ర విభజన
రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొట్టారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి డబ్బు తప్ప అభివృద్ధి తెలియదని విమర్శించారు. ముందుగా వైపాలెంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్యవైశ్య యువజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఇమ్మడిశెట్టి సుబ్బారావు, ఆయన సోదరుడు జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘాల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి సత్యనారాయణలను మంత్రి మాణిక్యాలరావు బీజేపీలోకి ఆహ్వానించారు.
కార్యక్రమంలో వీహెచ్‌పీ ఆలిండియా ప్రధాన కార్యదర్శి యక్కలి రాఘవులు, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి జీ రవీంద్రరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మువ్వల వెంకటరమణారావు, పార్టీ నాయకులు బత్తిన నరసింహారావు, భీమని మీనాకుమారి, కందుకూరి వెంకటసత్యనారాయణ, రేగుల రామాంజనేయులు, ఉలిసి ఏసుబాబు, ఆరె రమణయ్య, గోలి నాగేశ్వరరావు, శాసనాల సరోజిని తదితరులు పాల్గొన్నారు.