ఎచ్చెర్ల: బీఆర్‌ఏయూలో శుక్రవారం నిర్వహించిన ఫిజిక్స్ పరీక్షలో ప్రశ్నపత్రం తారుమారైంది. ఫిజిక్స్ ప్రశ్నపత్రానికి బదులు బీబీఎం కోర్సుకు సంబంధించిన సేల్స్‌మేనేజ్‌మెంట్ ప్రశ్నపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. తప్పిదాన్ని గుర్తించిన వర్సిటీ అధికారులు వెంటనే ప్రశ్నపత్రాలను వెనుకకు తీసుకున్నారు. వర్సిటీ పరీక్ష కేంద్రంగా డిగ్రీ చివరి ఏడాదిలో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయిన 761 మంది విద్యార్థులకు ఇన్‌స్టెంట్ పరీక్ష నిర్వహించారు.
వీరిలో 752 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫిజిక్స్ సబ్జెక్టులో 73 మంది ఫెయిల్ కాగా 69 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. ఫిజిక్స్ ప్రశ్నపత్రాలు అని రాసి ఉన్న బండిల్స్‌ను తెరచి ఇన్విజిలేటర్లకు వర్సిటీ అధికారులు అందజేశారు. అందులో ఫిజిక్స్-3 ప్రశ్నపత్రంకు బదులుగా బీబీఎం కోర్సుకు సంబంధించిన సేల్స్ మేనేజ్‌మెంట్ ప్రశ్నపత్రం ఉంది. వీటిని చూసుకోకుండా విద్యార్థులకు అందజేయడంతో సమస్యతలెత్తింది.
అధికారులు అందజేసిన సేల్స్ మేనేజ్‌మెంట్ సబ్జెక్టు ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారి జాబితాలో సైతం లేదు. ఈ ప్రశ్న పత్రాలు పెద్దమొత్తంలో ప్రచురించి ఎలా అందజేశారన్నది చర్చనీయాంశంగా మారింది. అదనపు సెట్ లు సైతం పరీక్షల నిర్వహణ కేంద్రంలో అందుబాటులో లేవు. దీంతో డిజైన్ ప్రశ్నపత్రాన్ని జిరాక్సులు తీసి విద్యార్థులకు అంజేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.30కు ఆరంభం కావడంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. అధికారులు అదనపు సమయం కేటాయించినా సాయంత్రం ఫిజిక్స్-4 పరీక్ష రాసేందుకు ఇబ్బంది పడ్డారు.
తొందరలో ఏమరపాటు...
డిగ్రీ చివరి ఏడాది ఒక్క సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులందరికీ శుక్రవారం పరీక్ష నిర్వహించి శనివారం ఫలితాలు వెల్లడించేందుకు వర్సిటీ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈనెల 3 నుంచి పీజీ ప్రవేశాలకు సంబంధించిన ఆసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ లోపు విద్యార్థులకు డిగ్రీ ప్రొవిజనల్స్, మార్కులు జాబితాలు, ఇతర ధ్రువీకరణ పత్రాలు చేరేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రయత్నంలో ఫిజిక్స్ ప్రశ్నపత్రం మారడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. మిగిలిన సబ్జెక్టుల విద్యార్థులు సజావుగా పరీక్షను పూర్తిచేశారు. పరీక్షలను ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పెద్దకోట చిరంజీవులు, ఎగ్జామినేషన్స్ డీన్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజులు పర్యవేక్షించారు.
మారిన ఫిజిక్స్ ప్రశ్నపత్రం
Published Sat, May 28 2016 12:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:04 AM
Advertisement
Advertisement