కరోనా బిలియనీర్లు | Manufacturers of gloves join the billion dollar club with Coronavirus | Sakshi
Sakshi News home page

కరోనా బిలియనీర్లు

Published Sun, Jul 12 2020 5:06 AM | Last Updated on Sun, Jul 12 2020 11:00 AM

Manufacturers of gloves join the billion dollar club with Coronavirus - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ కొందరి వ్యాపార జీవితాల్నే మార్చేసింది. ఓ వైపు కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే.. మరోవైపు సరికొత్త వ్యాపార అవకాశాలతో కొత్త బిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. ముఖ్యంగా చేతికి తొడుక్కునే గ్లవ్స్‌ తయారు చేసే కంపెనీల ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మలేíసియాలో రబ్బరు గ్లవ్స్‌ తయారుచేసే సూపర్‌ మాక్స్‌ కంపెనీ తొలిసారిగా బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరినట్టు బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ పేర్కొంది. కరోనా వేళ సూపర్‌ మాక్స్‌ షేర్‌ 400 శాతం పెరగడంతో ఆ సంస్థ ఫౌండర్‌ థాయ్‌ కిమ్‌ సిమ్‌ బిలయనీర్ల క్లబ్‌లో చేరారు. అదేవిధంగా టాప్‌ గ్లవ్స్‌ కంపెనీ షేరు ధర సుమారు రెండున్నర రెట్లు పెరగడంతో ఆ సంస్థ వ్యవస్థాపకుడు లిమ్‌ వీ చాయ్‌ కూడా బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరారు. హర్టేలిగా కోసన్‌ షేర్‌ ధరలు 100 శాతం పెరగడంతో వీటి అధిపతుల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ఇక  దేశంలోని అన్ని ఫార్మా కంపెనీల షేర్లూ భారీగా పెరిగాయి.

అదే బాటలో కొన్ని టెక్నాలజీ కంపెనీలు
► లాక్‌డౌన్‌ వల్ల పాఠశాలలు, సభలు, సమావేశాలు నిలిచిపోవడంతో వీడియో కాన్ఫరెన్స్‌ యాప్‌లకు ఒక్కసారిగా డిమాండ్‌ ఏర్పడింది. ఇందులో అమెరికాకు చెందిన జూమ్‌ యాప్‌ ముందు వరుసలో ఉంది.
► ఒకేసారి వందలాది మందితో మాట్లాడే అవకాశం ఉండటంతో విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి, రాజకీయ పార్టీలు కార్యకర్తలు, విలేకరులతో సమావేశాలు పెట్టడానికి ఈ యాప్‌ను అత్యధికంగా వినియోగించారు. 
► దీంతో జూమ్‌ యాప్‌ సృష్టికర్త ఎరిక్‌ యువాన్‌ ఆస్తి విలువ ఈ సంక్షోభ సమయంలో 2.58 బిలియన్‌ డాలర్లు పెరిగింది. అంటే.. ఈ మూడు నెలల కాలంలో యువాన్‌ సంపద సుమారు రూ.19,350 కోట్లు పెరిగింది. 
► ఒక్కసారిగా ఆన్‌లైన్‌ అమ్మకాలు పెరగడంతో వాల్‌మార్ట్, అమెజాన్‌ వంటి కంపెనీల షేర్లు భారీగా పెరిగి వారి సంపద కూడా వేల కోట్లు పెరిగింది. వాల్‌మార్ట్‌కు చెందిన జిమ్, అలిసే, రాబ్‌ వాల్టన్‌ల ఒక్కొక్కరి సంపద 3 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది. 
► ఈ సంక్షోభ సమయంలో రిలయన్స్‌ గ్రూప్‌ ఇప్పటికే వివిధ ఇన్వెస్టర్ల నుంచి రూ.1.70 లక్షల కోట్లు సమీకరించగా.. మరో నలుగురు ఇన్వెస్టర్ల నుంచి రూ.30 వేల కోట్లు సమీకరించనుంది. 
► కరోనా సమయంలో ఇలా సుమారు రెండు లక్షల కోట్లు సమీకరించడం తలపండిన ఇన్వెస్టర్లను కూడా ఆశ్చర్యపర్చింది. దెబ్బతో ముఖేష్‌ అంబానీ సంపద వారెన్‌ బఫెట్‌ను మించిపోయింది. 
► ఈ ఏడాదిలో అంబానీ సంపద 9.64 బిలియన్‌ డాలర్లు పెరగడం ద్వారా 67.9 బిలియన్‌ డాలర్లకు చేరింది. 
► డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్‌ అధిపతి అరవింద్‌ లాల్,  శ్రీరాం గ్రూప్‌ కంపెనీకి చెందిన అరుణ్‌ భరత్‌ రామ్‌ తొలిసారిగా బిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరారు.

కొత్త వ్యాపార అవకాశాలు
► కరోనా దెబ్బతో చాలా మంది ఉపాధి అవకాశాలు కోల్పుతుంటే మరికొంత మంది వినూత్న ఆలోచనలతో సరికొత్తగా ఉపాధి పొందుతున్నారు.
► ముఖ్యంగా ఇంటి వద్ద ఉండే మహిళలు వివిధ డిజైన్లలో మాస్క్‌లు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. వచ్చే ఏడాది కాలం పాటు మాస్క్‌ల వాడకం తప్పనిసరి కావడంతో డిజైనర్‌ మాస్క్‌లకు డిమాండ్‌ బాగా పెరుగుతోంది. 
► దీంతో పలు అంతర్జాతీయ కంపెనీలు బ్రాండెడ్‌ మాస్క్‌లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. 
► మరోవైపు కార్యాలయాలు, షాపులు, కార్లు, బస్సులు ఇలా ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న వాటికి శానిటైజ్‌ చేయాల్సి ఉండటంతో శానిటైజేషన్‌ వ్యాపారానికి పెద్ద ఎత్తున డిమాండ్‌ ఏర్పడుతోంది. 
► చాలా మంది నిరుద్యోగ యువత శానిటైజేషన్‌ను ఒక ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement