కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు | Amazon Hiring Another 75000 | Sakshi
Sakshi News home page

కరోనా : అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

Published Wed, Apr 15 2020 10:47 AM | Last Updated on Wed, Apr 15 2020 3:38 PM

Amazon Hiring Another 75000 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి. అయితే ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా పుంజుకోవడంతో భారీ స్థాయిలో కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. ఇప్పటికే అమెరికా మార్కెట్లో లక్షమందికి పైగా అభ్యర్థులను నియమించుకున్నసంస్థ మరో 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు సోమవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో వెల్లడించింది. అంతేకాదు అక్కడ పెరుగుతున్న అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాల పెంపు కోసం మొత్తం ఖర్చును 500 మిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది.  అయితే  భారతదేశంలో  మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగింపు,  ఏప్రిల్ 20 నుంచి కొన్ని అత్యవసర సేవలకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాల నేపథ్యంలో దేశంలో ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోందనే దానిపై ప్రస్తుతానికి ఎలాంటి స్పష్టత లేదు. (హెచ్-1 బీ వీసాదారులకు భారీ ఊరట)

మహమ్మారి కారణంగా సంభవిస్తున్న  ముఖ్యంగా అమెరికాలో ఆర్థిక సంక్షోభం ఫలితంగా ఏర్పడిన ఉద్యోగ నష్టాలను తగ్గించడానికి తన నియామక ప్రయత్నాలు సహాయపడతాయని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్  ప్రేరిత డిమాండ్ ను అందిపుచ్చుకున్న అమెజాన్ లక్ష మంది అదనపు సిబ్బందిని  ఇప్పటికే నియమించుకుంది. మరో 75వేల మందిని (ఫుల్ టైం, పార్ట్ టైం) నియమించుకోనున్నామని తెలిపింది. కోవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ గిడ్డంగుల నుంచి సరుకు రవాణా కోసం అత్యధిక మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం అత్యవసర (ఎమర్జన్సీ ఉత్పత్తులు) ఉత్పత్తులకు సంబంధించిన వస్తువుల ఆర్డర్లు తీసుకోవడంతో పాటు వాటి డెలివరీని కూడా నిర్ణీత సమయంలో అందిస్తామని స్పష్టం చేసింది. అయితే అత్యవసర ఉత్పత్తులకు సంబంధించిన వస్తువులను కూడా ముందుగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు (ప్రీ ఆన్‌లైన్‌ ప్రేమెంట్‌) జరిపిన వారికే అందిస్తామని ప్రకటించింది. ఉద్యోగుల భద్రతకు సంబంధించి టెంపరేచర్ తనిఖీ,  శానిటైజింగ్, మాస్క్ లు లాంటి అత్యవసర భద్రతా చర్యలను కచ్చితంగా పాటిస్తామని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement