మావోస్టు శబరి ఏరియా కమిటీ దళ సభ్యుడు ముచ్చిక అడమయ్యను అరెస్టు చేసినట్టు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్ తెలిపారు. గురువారం ఎటపాక పోలీస్ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం రాత్రి ఎటపాక మండల పరిధిలోని గొల్లగుప్ప అటవీ ప్రాంతంలో ప్రత్యేక పోలీసు బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా అడమయ్య పట్టుబడ్డాడని తెలియజేశారు.
అడమయ్య చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి పంచాయతీలోని లంకపల్లికి చెందినవాడని, ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి వరకు చదివి వ్యవసాయం చేసుకుంటున్న అతడు శబరి ఏరియా కమిటీ కార్యదర్శి నగేష్ ప్రోద్బలంతో మావోయిస్టుల కార్యక్రమాలకు ఆకర్షితుడయ్యాడని వివరించారు. అడమయ్యకు 2014లో ఏడాది పాటు శిక్షణ ఇచ్చి ఈ ఏడాది దళంలో చేర్చుకుని 303 వెపన్ ఇచ్చారని తెలిపారు.
ఇటీవల జరిగిన లక్ష్మీపురం చర్చి పాస్టర్ తనయుడి కిడ్నాప్‌లో, మారాయిగూడెం సమీపంలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లపై కాల్పులు జరిపి ఒకరిని హత్య చేసిన ఘటనలో అడమయ్య పాల్గొన్నాడన్నారు. పోస్టర్లు వేయటం, రహదారులు తవ్వటం వంటి పనుల్లో చురుకుగా పాల్గొనే వాడని తెలిపారు.