అడవిలో జల్లెడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘పశ్చిమ’ ఏజెన్సీలో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొద్దిరోజులుగా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో మావోల సంచారం, కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కుమారుడి కిడ్నాప్, పలువురు వ్యాపారులు, ప్రముఖులకు డబ్బు కోసం బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం వంటి పరిణామాల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ చేపట్టినట్టు తెలుస్తోంది. శని వారం అటవీ ప్రాంతంలో సాయుధ పోలీసులు ప్రవేశించి మొత్తంగా జల్లెడ పడుతున్నట్టు సమాచారం.
ఏలూరు నుంచి అడవిలోకి వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీస్ బృందంలో 14మంది సభ్యులున్నట్టు తెలుస్తోంది. అయితే, కూంబింగ్‌పై అధికారికంగా సమాచారం ఇచ్చేందుకు పోలీసు అధికారులు సుముఖత వ్యక్తం చేయడం లేదు. అసలు ఆ ప్రాంతంలో సంచరిస్తోంది మావోయిస్టులా.. వారి పేరుచెప్పుకుని నకిలీ దళాలు దందా చేస్తున్నాయా అనే అంశంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ‘పశ్చిమ’ ఏజెన్సీలో తెలంగాణలోని మావో ప్రభావిత ఖమ్మం జిల్లా మండలాలు కలిసిన నేపథ్యంలో మావోయిస్టుల వ్యవహారంపై సీరియస్‌గానే దృష్టి కేంద్రీకరించామని ఆ అధికారి వెల్లడించారు.